కొమురం భీం "ఓ అగ్గిబరాటా"
కొమరం భీం నిజాంసర్కార్ గుండెల్లో
నిద్రపోయిన "ఓ అడవి సింహం"
తాము సాగుచేసుకునే భూమిని ఆక్రమించిన
జమీందారు సిద్దిఖ్ ను హతమార్చిన "ధైర్యశాలి"
స్వయం పాలనకోసం
ఆదివాసుల ఆత్మగౌరవంకోసం
హక్కుల కోసం
అడవి బిడ్డల విముక్తికోసం
నిజాం నవాబుల దోపిడీలకు దౌర్జన్యాలకు కౄరత్వానికి
వ్యతిరేకంగా కొండల్లో కోనల్లో
గెరిల్లా పోరాటాన్ని సాగించిన "ఉద్యమాల వేగుచుక్క"
"జల్ - జంగిల్ - జమీన్"
నినాదంతో రణభేరి ప్రయోగించిన
"ఓ పోరాటయోధుడు"
60 ఎకరాల అడవిని నరికి
12 గ్రామాలను ఏర్పరిచి
అడవి బిడ్డలు
పోడు వ్యవసాయం చేసుకుంటూవుంటే
వేసిన పంటలను ధ్వంసం చేస్తూ
అరకకు 5 రూపాయలు
పోడుకు 2 రూపాయలు
పన్నును రైతులపై విధిస్తూ
కట్టలేనివారిని కొట్టి వేధిస్తూ చిత్రహింసలకు గురిచేస్తూ
జరిమానాలు విధిస్తూ వుంటే
"మా ఊర్లో మా రాజ్యం" నినాదంతో
నిజాంపాలకుల నిరంకుశత్వానికి
వ్యతిరేకంగా ఆదీవాసులంతా
కొమరం భీం నాయకత్వంలో
నడుం బిగించి తుడుం మోగించారు
పశువుల కాపర్లపై విధించిన
సుంకానికి వ్యతిరేకంగా
నిజాం సైనికులతో
వీరోచితంగా పోరాడి పోరాడి
కుర్దు పటేల్ నమ్మకద్రోహంతో
వీరమరణం పొందిన కొమరం భీం
"ఓ వీప్లవ సింహం"
"నింగికేగిన ఓ ధృవతార"
కొమరం భీమ్ "అమరత్వం"
జోడేఘాట్ గుట్టల్లోనేటికీ ప్రతిధ్వనిస్తుంది
"చైతన్యస్ఫూర్తిని" రగిలిస్తుంది
ఆదివాసుల హక్కులకోసం
ప్రాణత్యాగం చేసిన
ఓ విప్లవవీరుడా!
గోండుల గుండెల్లో
కొలువైన ఓ దేవుడా!
కొండల్లో మండేటి ఓ సూర్యుడా!
ఓ కొమరం భీమా !
మీకిదే మా అక్షర నీరాజనం!



