Facebook Twitter
నగరంలో నరకం....

నిత్యం
సాగరగర్భంలో
అలజడులే అల్లకల్లోలాలే
వాయుగుండాలే అల్పపీడనాలే
వాతావరణశాఖ హెచ్చరికలే
నిన్న కరోనా కరాళనృత్యం
విలయతాండవం, విధ్వంసం,ఆ
విషాదం నుండి తేరుకోకముందే
నగరంలో కుంభవృష్టి...

వరదలు... వార్తలు... టీవీలో
హృదయ విదారక దృశ్యాలు...
నగరవాసులు ప్రత్యక్షంగా
నరకాన్ని వీక్షిస్తున్నారని...
కారుచీకటిలోకాలనీవాసులని...

లోతట్టు ప్రాంతవాసులు
చెరువులు తెగి వాగులు
వంకలు పొంగి పొర్లి ఆ
నీటి ఉధృతికి కళ్ళెదుటే
కుటుంబసభ్యులు సామగ్రి
కొట్టుకుపోతున్నా రక్షించుకోలేని
నిస్సహాయులని...

గాడాంధకారంలో గబ్బిలాలని...
ఎక్కడ చూసినా విన్నా
బిక్కుబిక్కుమంటూ
పిల్లాపాపలతో ఆకలికేకలేనని...
కట్టుబట్టలతో రోడ్లమీద రోదనలేనని...
ఆపన్నహస్తాలకోసం ఎదురుచూపులేనని...
విల్లావాసులు సైతం వీధిలో అనాధలేనని...

కారణం....ఒక్కటే......
గంటల...తరబడి కురిసింది...కుంభవృష్టి...
జలమయమైపోయింది మహానగరం
జలదిగ్బంధంలో చిక్కుకున్నజనాల
జాతకాలే మారిపోతున్నాయి
జలసమాధైపోతున్నారు, పాపం
జలప్రళయానికి బలైపోతున్నారు

ఖర్మకాలి, విధి విహారయాత్ర" చేస్తే
మన విషాదం...మన విధ్వంసం... 
మన వినాశనమే... దానికి వినోదం విందు

అందుకే....
ముక్కోటి దేవతలకు మ్రొక్కి కోరుకునేదొక్కటే
ఈ దుర్గంధం...ఈ అంధకారం...ఈ దురవస్థ
ఈ మనశత్రువులకు సైతం వద్దని...రావద్దని

ఇకనైనా కాస్త శాంతించాలి ! ఓ ప్రకృతిమాత !
తక్షణమే ఆపన్నహస్తమందించి అందరిని
ఆదుకోవాలి దాతలు ! ప్రభుత్వాధినేతలు !