వండిన వంట...
ఆశతో వండినవారి ఆకలి తీరవచ్చు
కష్టపడనివారి కడుపులు నిండవచ్చు
పాపం ధనం వెచ్చించినా దక్కకపోవచ్చు
ప్రక్కనున్న కుక్కలు పీకలదాకా మెక్కవచ్చు
పండిన పంట...
రేయింబవళ్ళు రెక్కలు ముక్కలుచేసి
రక్తం ధారపోసిన రైతన్నలు పొందవచ్చు
విత్తనం వెయ్యని వారికీ చెందవచ్చు
దళారులకు దగాకోరులకు అందవచ్చు
కలిపిన జంట...
సహనంతో సఖ్యతతో సర్దుబాటుగుణంతో
పదికాలాలపాటు పచ్చనికాపురం చేయవచ్చు
విడిపోనిబంధంగా వుండవచ్చు విడిపోవచ్చు
విధివిషం చిమ్మితే అదిమూడునాళ్ళముచ్చట కావచ్చు
రగిలితే ఆకలి మంట...
ప్రశ్నించవచ్చు
ప్రతిఘటించవచ్చు
పిడికిళ్ళు బిగించవచ్చు
భీకర పోరాటం చేయవచ్చు
దారుణ మారణహోమం జరగవచ్చు
అమాయకుల రక్తం ఏరులై పారవచ్చు
రామరాజ్యం రావణకాష్టమై రగలవచ్చు
ఏదేమైనా అంతా కనిపించని ఆ కాలనిర్ణయం కావొచ్చు
అంతుపట్టని ఆవిధి ఆడుతున్న ఓ వింతనాటకం కావచ్చు



