మందార మకరంద
మాధుర్యమును
గ్రోలే తుమ్మెదలు
రసహీనమైన
పువ్వుల జోలికి పోవు
అలాగే భగవంతుడి
మధురనామాల్లోని తేనెలను
గ్రోలే హృదయాలు
ఇతర విషయాలపై
ఆసక్తిని కనపరచలేవు
సంస్కారవంతమైన
మధురమైన మంచిమాటలే
అందమమైన ఆభరణాలు
మంచిమాట ముందు
విలువైన కేయూరహారాలు,
చంద్రకాంతమణులు
పొదిగిన దండలు,
పవిత్ర జలాలతో చేసే స్నానాలు,
విలువైన చందనాలు,
పరిమళాలు వెదజల్లే పూలదండలు,
చక్కగా అలంకరించిన శిరోజాలు,
ఏవీ పనికిరావు
మనిషి బాగుపడాలంటే
పెద్దలపట్ల భయం కాని ఉండాలి
భగవంతుని పట్ల భక్తి కాని ఉండాలి
లేదా మంచి విషయాలపైన
ఆసక్తి కాని ఉండాలి
భయముగాని భక్తి గాని
ఆసక్తి గాని లేని మనిషి
తెగిన గాలిపటంలా
ఎప్పుడు ఎక్కడ ఎలా
పతనమౌతాడో ఎవరికీ తెలియదు
నిప్పు ల్లోకి దూకే మిడతకు
ఆ నిప్పు కాల్చివేస్తుందన్న
సత్యం తెలియదు
దుర్వెసనాలలో మునిగి
కర్తవ్యాన్ని మరచిన
మనిషిని ఆ దేవుడు
సైతం బాగు చేయలేడు



