విరితోటలో
విరిబూసి గుబాళించే
ప్రతిపువ్వులోనా? లేదు లేదు
ఎత్తైన పర్వతాల్లో
కప్పిన తెల్లనిమంచులో
పశువుల్లో పక్షుల్లో పచ్చని వృక్షాల్లో
పరవశింపజేసే ప్రకృతిలోనా ? లేదు లేదు
గుడి గోపురాల్లో
గర్భగుడుల్లో ప్రతిష్టించిన
సుందరమైన దేవతాశిల్పాల్లోనా? లేదు లేదు
బడిలో ఆటపాటల్లో మునిగితేలే
పసిపిల్లల ముసిముసి నవ్వుల్లో
అమాయకపు చూపుల్లో అల్లరి చేష్టల్లోనా? లేదు లేదు
నవజవ్వని ఓరచూపుల్లో కోరచూపుల్లో
కొంటెచూపుల్లో చిలపిచూపుల్లో చిలకపలుకుల్లో
నాజూకైన నడుములో ఎగిరే ముంగురుల్లో
జడలో మెడలో చేతి గాజుల్లో కాటుక కళ్ళల్లో
కాలిఅందెల్లో కట్టినచీరలో పెట్టినబొట్టులోనా? లేదు లేదు!
జలజలదూకే జలపాతాల్లో గలగలపారే సెలయేరుల్లో
నిర్మలంగా నిశ్చలంగా ప్రవహించే నదుల్లో
తీరం చేరాలని ఆరాటపడే కడలి అలల్లోనా ? లేదు లేదు
ఓ సౌందర్యమా మరి నీవెక్కడ?
ఆపదలో ఆదుకునే అమృతహస్తాల్లో
కరుణ ప్రేమ దయ జాలి మంచితనం
మానవత్వంతో నిండి పొయ్యిమీద
పాలలా పొంగిపొర్లే ప్రతిమనిషి అంతరంగంలో నేనక్కడ



