కోపం కొరివిదెయ్యమైతే కొంపకొల్లేరౌతుంది
కళ్ళు నిప్పులు చెరుగుతాయి
మనిషిలోనీ మానవత్వం మంటకలిసిపోతుంది
రక్షకుడు సైతం రాక్షసుడౌతాడు రకాన్ని రుచిచూస్తాడు
కోపం వస్తే కాస్త జాప్యం చేస్తే అదే దానికి ఔషధం
ఒకటి నుండి వందవరకు అంకెలలెక్కింపే దానికి సంకెళ్లు
లేదా బ్రతుకు బుగ్గిపాలే... పరువు గంగపాలే....
పొయ్యి మీద పాలు పొంగిపోతుంటే క్రింద మంటను
తగ్గించకున్న పొంగిపోయిన పాలు... పొయ్యి పాలే...
మిగులేది ఖాళీపాత్రే...కారణం క్రిందపెట్టిన మంటేగా...
అదే ఆరితే... పాలు మీకు దక్కినట్లేగా...
మీరే మారితే...
మిమ్మల్ని ప్రేమించినట్టు నటించే ఆ కోపం
మిమ్మును నిలువునా దహించే అగ్నిజ్వాలని
అది వేడిపుట్టించే ఒక మాయలేడని
ఆపై మిమ్మును మీరే...హత్య చేసుకునేలా
ఆత్మహత్య చేసుకునేలా... ప్రేరేపిస్తుందన్న
మీ కంటిని మీరే... పొడుచుకునేలా
మీ ఒంటిని మీరే... కాల్చుకునేలా
మీ ఇంటిని మీరే... కూల్చుకునేలా
మీ రక్తాన్ని మీరే... పీల్చుకునేలా చేస్తుందన్న
దీపం చుట్టూ పురుగుల్లా...
అయస్కాంతానికి అతుక్కునే ఇనుపముక్కల్లా...
క్షణాల్లో మిమ్మల్ని మృగాల్లా...మార్చివేస్తుందన్న..
మాయ చేస్తుందన్న ఒక
"నిప్పులాంటి నిజం" మీకు తెలిసినట్లేగా..
అందుకే ముక్కుమీద కోపమున్నవారు మూర్ఖులే
అకారణంగా వారుకోపంతో కుతకుతలాడిపోతారు
అందమైన జీవితాన్ని అంధకారం చేసుకుంటారు
కోపం కొండ చిలువైతే జీవితం ఎండిన కలువపువ్వే
తమ కోపమే తమకు శత్రువు తమ శాంతమే తమకు రక్ష
దయ చుట్టంబని నాటి కవిశేఖరులు పలికిన
అమృతవాక్కుల్ని ఎవరైనా... మరువరాదు కలనైనా ...



