Facebook Twitter
నిన్నటి తేనె‌...నేడు విషం ?

అందమైనదని
ఆస్తిపాస్తులున్నాయని
ఇష్టపడి మూడుముళ్ళువేసి
ఎన్నో ఏళ్లు‌ హాయిగా
కలిసి‌ కాపురం చేయగా
భార్యంటే మోజు కాస్త తగ్గిపోవచ్చు

నిన్నటి తియ్యటి బెల్లం
నేడు అల్లం కావచ్చు
నిన్నటి ప్రాణదేవత
నేడు దెయ్యం కావచ్చు
నిన్నటి తేనెచుక్క
నేడు విషపుచుక్కకావచ్చు
రోజు రోజుకు ప్రేమజ్వాల
కాసింత కాసింత చల్లారిపోవచ్చు ఆపై

"పరస్త్రీ వ్యామోహం"లో పడిపోవచ్చు
అది అత్యంత ప్రమాదకరం కావొచ్చు
మనిషి వ్యక్తిత్వానికి
చెరగని మాయని మచ్చకావచ్చు
నిన్నటి ఆ మూడుముళ్లు
మూన్నాళ్ళ ముచ్చట కావచ్చు

విధి విడదీయవచ్చు విడాకులతో
ఆ ఇరువురనుభవించే
స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు
ఇనుపసంకెళ్లు పడవచ్చు అందుకే
ఓ దంపతులారా ! జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త !