Facebook Twitter
ఓ మనిషీ ! వద్దు అక్రమార్జన వద్దు !

అవినీతితో ఆరగించేదేదైనా అది "నేడు పెళ్ళివిందే"
అమాయకులను "జలగలా" పీడించి అక్రమార్జనతో
ఎంత ధనాన్ని ఆర్జించిననేమి "ఆ దైవం" మెచ్చునా ?

ఖరీదైన విల్లాల్లో సుందరగ్రానైట్ 
భవనాల్లో హంసతూలికాతల్పాలపైన నీవు
శయనించినా అది నీకు "సుఖనిద్ర" నిచ్చునా?

రేపు అది నీ మెడకు "ఉచ్చు"కాదా?
నీ బంగారు బ్రతుక్కు "ఆరనిచిచ్చు"కాదా?
నిజంగా నీవు బ్రతికినా నీవొక "జీవశ్చవం"కాదా?

నీతి - అవినీతి త్రాసులో నీవు "నీతివైపు"
తూగితే నీకు "ఖండాంతర ఖ్యాతి" ఖాయమేగదా

నేడు అవినీతితో అందలమెక్కినా
రేపు నీవు ఏ అంధకారంలోకో...ఏ అగాథంలోకో... 
ఏ అథఃపాతాళానికో ...జారిపోకతప్పదే.....
"జాతకాలు" మారి "జైలుపక్షిగా"మారిపోకతప్పదే

అందుకే, ఓ మనిషీ ! వద్దు అక్రమార్జన వద్దు !
నిస్వార్థంగా వుండు ! నీతిగా వుండు ! నిర్మలంగా
నిశ్చలంగా వుండు ! నిరంతరం నిప్పులా మండు !

ఎప్పుడైతే అవినీతి మంటలు ఆరిపోతాయో
ఎప్పుడైతే ఈ దేశాధినేతలు, ఈ అధికారులు 
తమకు అందని దానికి, తమకు చెందని దానికి
అర్రులుచాచక, ఆశపడక,నిబద్ధతతో నీతితో జీవిస్తారో...

అప్పుడే నా భరతమాత ఒక "అగ్నిపునీత"
అప్పుడే నా భరతమాత ప్రపంచానికో "స్పూర్తిప్రదాత"
అప్పుడే నా ఈ సువిశాల సస్యశ్యామల "భరతఖండం"
సమభావం సమానత్వం తప్ప"ఆకలి","అవినీతి"
వేయి కాకడాలు పెట్టి వెతికినా కనిపించని
"ఓ వేదభూమిగా" ఈ అవినిపై "ఘనకీర్తిని" ఆర్జిస్తుంది

"సుఖశాంతుల‌కు" సిరిసంపదలకు" నిలయమౌతుంది
ప్రపంచానికే నావేదభూమి వేగుచుక్కై వెలుగునిస్తుంది
ఈభువిలో నా భారత్ ఒక "స్వర్గసీమై" విలసిల్లుతుంది