అదేమి బ్రతుకో అర్థంకాదు
ఎవడు కోపిష్టివాడో
ఎవడు పాపిష్టివాడో
ఎవడు అబద్దాలకోరో
ఎవడు పచ్చిమోసగాడో
ఎవడు పరమ ఆశబోతో
ఎవడు నమ్మినవారిని
నట్టేటముంచే నయవంచకుడో
ఎవడు అరచేతిలో స్వర్గం చూపిస్తాడో
ఎవడు మాయమాటల మాంత్రికుడో
ఎవడు మందినోట్లో మట్టికొట్టి
తనది కాని ధనాన్ని దోచుకుంటాడో
బ్యాంకులో భద్రంగా దాచుకుంటాడో
ఎవడు నవ్వుతూ నీతులు చెబుతాడో
వెనుక లోతుగా గోతులు త్రవ్వుతాడో
అట్టివాడి దుష్టక్రియలన్నీ
ఒకరోజు బట్టబయలుకాక తప్పదు
అట్టివాడికి వీధికుక్కసైతం విలువనివ్వదు
అట్టివాడికి ఆ దైవం కూడా
కళ్ళు బైర్లుకమ్మేలా
కనువిప్పు కలిగేలా
దిమ్మ తిరిగేలా చేస్తాడు
ఖఠినమైన శిక్షను విధిస్తాడు
వాడే కన్నుమూస్తే...
ఇంటివారుకూడా కంటనీరు పెట్టుకోరు
వాడే కన్నుమూస్తే...
పిలిచినా రాకపోవచ్చు
కాకులు, వాడి పిండాన్ని తినడానికి
వాడిది దిక్కులేని కుక్కచావే సుమా!



