ఐనా చెప్పక తప్పదు ఒక చేదునిజం
అత్తారింటికి కట్నంతేని ఆడపిల్లలకు రోజు
యుద్దం చేసే బద్దశతృవులు నలుగురు
ఆశబోతు అత్త...
మాయదారి మామ...
ఆడిపోసుకునే ఆడపడుచు...
తిట్టి కొట్టి చిత్రహింసలు పెట్టి
కడకు కడతేర్చే కసాయి మొగుడు...
ఐనా చెప్పక తప్పదు ఒక చేదునిజం
నిర్మానుష్యమైన
నిశీధిలో నిశ్శబ్దపు మరకలు
చిక్కని చిమ్మచీకటిలో
గుడ్లగూబల గురకలు
అగ్నిపర్వతం బ్రద్దలైనట్లు
గగనతలం మార్మోగినట్లు
వినిపించింది "అమ్మా"
అన్న ఒకేఒక్క గావుకేక
పాపం కాబోలది ఒక చావుకేక
ఆ కేకలు ఆ అరుపులు
తీరని ఆ వేదన ఆవేదన
అంతులేని ఆ ఆరాటం
చివరికి మృత్యువుతో పోరాటం
ఐనా చెప్పక తప్పదు ఒక చేదునిజం
నే ఉలిక్కిపడి దిగ్గున లేచాను
దిక్కులు చూశాను
అది కలకాదు నిజమని
కలవరపడి పోయాను
ఉక్కిరిబిక్కిరై పోయాను
బిక్కుబిక్కుమంటూ పక్కింట్లోకి
నక్కి నక్కి చూశాను
వెక్కి వెక్కి ఏడుస్తుంది
ఒక స్త్రీ రూపం
పక్కలో కత్తిపోటు పాపం
నిన్నటివరకు ఆమెకు బ్రతికే ఒక నరకం
నేడు చితికి చేరింది ఒక స్త్రీ జీవితం
అది కట్నంకోసం ఓ కసాయిభర్త చేసిన
ఘోర కిరాతకం... అందుకే
ఐనా చెప్పక తప్పదు ఒక పచ్చినిజం
ఇకనైనా ఈ కంప్యూటర్ యుగంలో నైనా
కళ్ళు తెరవాలి నిజం తెలుసుకోవాలి
ఆడపిల్లలంతా కిల్లర్ లై కిరణ్ బేడీలై
పులులై పూలన్ దేవీలై
చీల్చుకుంటూ పైకిలేవాలి
చీమల పుట్టల్ని
కన్యలందరూ కలిసి కట్టాలి
వరకట్నపు వరదలకు ఆనకట్టల్ని
ఐనా చెప్పక తప్పదు ఒక పచ్చినిజం
ప్రశ్నిస్తేనే ప్రగతని...
ప్రతిఘటిస్తేనే ప్రతిఫలమని...
ఉద్యమిస్తేనే స్త్రీ జాతికి ఉషోదయమని...



