Facebook Twitter
నేడు మీ కళ్ళు వర్షిస్తున్నాయి

మిత్రమా నేడు...
మీ మనసు మూగబోయింది
మీ హృదయం బాధతో విలవిలలాడిపోతోంది
కారణం నిన్నవుండి నేడులేని మీ ప్రాణమిత్రున్ని
కడసారి చూడాలని వీడ్కోలు పలకాలని
మీ మిత్రునికి పుష్పగుచ్చం ఇవ్వబోతున్నారు
కాని చలనంలేని మీ మిత్రుడు ఇప్పుడు
వాటిని తన చేతులతో స్వీకరించలేడే...
తీసుకొని మీకు తన కృతజ్ఞతలు చెప్పలేడే...
ఆనందంతో మిమ్మల్ని ఆలింగనం చేసుకోలేడే...
 
కానీ మీ మిత్రుడు బ్రతికుండగానే
వచ్చిన పుట్టినరోజు సందర్భంగా
ఈ పుష్పగుచ్చాన్ని ఇచ్చివుంటే, ఇచ్చి
షేక్ హ్యాండచ్చి శుభాకాంక్షలు చెప్పివుంటే
మనసులో ఎంత హర్షించేవాడో కదా...
అందుకే నేడు మీ కళ్ళు వర్షిస్తున్నాయి...
ఎన్ని జన్మలెత్తినా తిరిగిరాని...
ఓ బంగారుఅవకాశం చేజారిపోయిందేనని...

నిన్న వుండి నేడు లేని
మీ మిత్రుడు మంచివాడు
మాహానుభావుడు జాలిగుండె గలవాడు
గొప్ప స్నేహశీలి త్యాగమూర్తి అని మీరు
ఎంతగా అరిచినా రోదించినా అది అరణ్యరోదనే...
వారి చెవులకు ఏఒక్క అక్షరమైనా వినపడదాయే...

కానీ అదే మీమిత్రుని ఏ పదవీవిరమణకో షష్టిపూర్తికో
అందరి ముందర ఈ మంచిమాటలు చెవినవేసివుంటే
ఈ శుభాకాంక్షలు చెప్పివుంటే
మీ మిత్రుడెంతగా పులకించి పోయావాడో కదా...
ఆలింగనం చేసుకొని ఎంతగా ఆనందించేవాడో కదా...

కానీ నాడు చిన్నమనస్పర్థతో వెళ్ళకపోతిరాయే...
నేడు వచ్చి లాభమేమీ ?
పుష్పగుచ్చం తెచ్చి లాభమేమి?
ఎంతగా కుమిలి కుమిలి ఏడ్చిలాభమేమి?
జరగరాని ఘోరం జరిగిపోయే...
తిరిగిరాని లోకాలకు మిత్రుడు తరలిపోయె...
అందుకే నేడు మీ కళ్ళు వర్షిస్తున్నాయి...
ఎన్ని జన్మలెత్తినా తిరిగిరాని...
ఒక బంగారు అవకాశం చేజారిపోయిందేనని...
ఔను ముందే మేల్కోవాలి సత్యం తెలుసుకోవాలి
కరిగిన కాలం...విసిరిన బాణం...నేల ఒలికిన క్షీరం
ఇక ఈ జన్మకు రావని...తిరిగి రావని...రానేరావని