చైనాలో కరోనా పుట్టింది
ఇండియాలో కాలు పెట్టింది
వలస కార్మికుల కడుపు కొట్టింది
దాతలారా ఓ ధన్యజీవులారా
మనసున్న ఓ మహా రాజులారా
ఒక్కపచ్చినిజాన్ని తెలుసుకోండి
ధనవంతులందరూ దాతలు కారని
కాని దాతలందరూ ధన్యజీవులేనని
నేడు ఇష్టంతో పేదలకు
ఇచ్చువారు,రేపు ఆ పరమాత్మ నుండి
పుష్కలంగా పుచ్చుకుంటారని
పిడికెడు బియ్యం, వీధిలో విసిరిన
చాలు, పది పిట్టల పొట్టలు నిండునని
పరులను దోచిదోచి బ్యాంకుల్లో ధనం దాచిదాచి
తాతినక,పిల్లికింత బిక్షం పెట్టక పిసనారివై
కోట్లు కోట్లు ఆర్జించి ఏం కట్టుకుపోదామని
రేపు నీ చేతిలోని సెల్ ఫోన్ కూడా నీ వెంటరాదే
ఖర్మకాలితే, కరోనా సోకితే, కాటికెళ్ళేనాడు
పక్కనెవ్వరూ లేక పలకరించే నాధుడేలేక
నీవు అంత్యక్రియలకైనా నోచుకోని ఓ అనాధవేగా
నిన్నటి వరకు నాది నాది అనుకున్నదేదీ నీదికాక
నీ వెంట కన్నబిడ్డలులేక కట్టుకున్న భార్య రాక
కడచూపైనా దక్కక నీది దిక్కులేని కుక్కచావేగా
చైనానుండి కరోనా రక్కసి వచ్చిందే
లక్షలమందిని పొట్టన పెట్టుకుందే
వలసకార్మికలకు పుట్టెడు దుఃఖాన్ని తెచ్చిపెట్టిందే
ఆకలికి అలమటించే అస్థిపంజరాలను చేసిందే
మానవత్వం మరచిన ఓ మనుషుల్లారా
ఇంకెప్పుడు మీకు కనువిప్పు కలుగుతుంది?
ఇకనైనా ఈ కరోనా కాలంలోనైనా మారండి ?
రండి మనలాగే మన పొరుగువారిని ప్రేమిద్దాం
దిక్కులేని ఆ వలసకూలీలనాదుకుందాం ఆకలితీరుద్దాం



