Facebook Twitter
కరోనా కాలంలో కాపురాలు

కరోనా వచ్చింది లాక్ డౌన్ తెచ్చింది

*ఈ లాక్ డౌన్ సమయంలో* 

అన్నీ అర్థం చేసుకునే 

మంచి మనస్తత్వం

మానవత్వం,సహనం, 

సరుర్దుబాటుగుణం వున్న

భర్తలున్న భార్యలకు 

*ఆ ఇల్లు ఒక భూతలస్వర్గమే*

 

కానీ,చీటికీ మాటికీ కోపపడే

చిన్నదానికి చిర్రుబుర్రులాడే 

శాడిస్ట్ భర్తలున్న భార్యలకు 

*ఆ ఇల్లు ఒక నరకకూపమే*

 

కరోనా వచ్చింది లాక్ డౌన్ తెచ్చింది

*ఈ లాక్ డౌన్ సమయంలో*

ఇంట్లో ఎవరూ లేక 

కొత్తజంటలిద్దరే వుంటే

ఇక హాయిహాయిగా గడిపే

ఆ సమయం ఒక హనీమూనే

ఆ ఇల్లు ఒక ఇంద్ర భవనమే

ఆ ఇల్లు ఒక ఫైవ్ స్టార్ హోటలే 

*ఆ ఇల్లు ఒక చిన్న చికుబుకు రైలే*

 

కానీ,కలతలతో కలహాలతో

అనుమానాలతో అపార్థాలతో

చీటికీ మాటికీ కత్తిపోటులాంటి 

ఎత్తిపొడుపు మాటలు మాట్లాడుకుంటూ

తలుపులు కిటికీలు అడ్డుపెట్టుకొని, తిట్టుకునే

వీధికెక్కి జుట్టుజుట్టు పట్టుకొని, కొట్టుకునే

పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే భార్యాభర్తలున్న 

*ఆ ఇల్లు ఇద్దరికీ ఒక జైలే*

 

కరోనా వచ్చింది లాక్ డౌన్ తెచ్చింది

*ఈ లాక్ డౌన్ సమయంలో*

పిల్లా పాపలతో చల్లగా 

ఆడుతూ పాడుతూ ఆనందంగా

ఉల్లాసంగా ఎంతో ఉత్సాహంగా 

కుటుంబమంతా కలిసి కులాసాగా

పరమానందంగా పచ్చగా ప్రశాంతంగా ఉన్న

*ఆ ఇల్లు అందరికీ ఒకే ఆనందనిలయమే*

 

కానీ,ఇంటిలో కుటుంబ సభ్యుల మధ్య

కక్షలు కార్పణ్యాలతో,పగలు ప్రతీకారాలతో

ఉండేది ఒకే ఇంట్లోనేనైనా వేరువేరుగదుల్లో  

మాటలు లేకుండా మౌనవ్రతం దాల్చి

రక్తసంబంధీకులైనా రాక్షస మనస్తత్వంతో

కనిపిస్తే కస్సుబుస్సుమనుకుంటూ

ఒకరపై ఒకరు కత్తులు దూసుకుంటూ 

ఎడమొహంగా  పెడమొహంగా

బద్ధశత్రువుల్లా బ్రతుకుతున్న

*ఆ ఇల్లు విధివంచితుల విషవలయమే*

 

కరోనా వచ్చింది లాక్ డౌన్ తెచ్చింది

*ఔను,ఈ లాక్ డౌన్ సమయంలో*

కాలసర్పమై కరోనా పొంచివున్న కాలంలో

*కొందరికి ఆ ఇల్లే ఒక రక్షణ కవచం*

*కొందరికి ఆ ఇల్లే ఒక అగ్నిగుండం*