కరోనా వచ్చింది లాక్ డౌన్ తెచ్చింది
కరోనా వచ్చింది వలసకూలీల కడుపు కొట్టింది
మొత్తం ప్రపంచాన్నే చిత్తుచేస్తున్న
ఆ కరోనా రక్కసి కోరలకు చిక్కకుండా ప్రజలంతా
బిక్కుబిక్కుమంటూ, దిక్కుతోచక
ఇళ్ళల్లో నక్కి నక్కి కూర్చొని వుంటే
పాపం వలసకూలీలు, ఆ కరోనా కాలసర్పం
కాటేస్తుందని తెలిసినా,ప్రాణాలకు తెగించి
పిల్లాపాపలను చంకలో పెట్టుకొని
తట్టాబుట్టా నెత్తిన పెట్టుకొని
ఎర్రని ఎండల్లో మలమలమాడుతూ
ఆకలికి అలమటిస్తూ, అస్థిపంజరాలై
దాహం తీర్చుకునే దారిలేక
ఆదుకొనే నాధుడు లేక
వేలకిలోమీటర్లు నడుచుకుంటూ
కాలేకడుపులతో
కాళ్ళీడ్చుకుంటూ,
కన్నీరు కార్చుకుంటూ
ఉపాధి కరువై, బ్రతుకు బరువై
గుండె చెరువై, సొంత ఊర్లకు
కళ్ళల్లో కోటి ఆశలు పెట్టుకొని
తమవారిని కలవాలన్న తపనతో
దూరాన్ని కాని నిప్పులు చెరిగే ఎండను కాని
లెక్కచేయకుండా, ఎవరి సహాయం కోరకుండా
నడిచి నడిచి కాళ్ళు బొబ్బలెక్కుతున్నా
"అబ్బా అబ్బాఅనక"
నడిచి నడిచి నడుములు విరిగి పోతున్నా
"అమ్మా అమ్మా అనక"
ఏ దిక్కూమొక్కూలేక ఏ దేవుళ్ళకు మ్రొక్కక
చీమలబారుల్లా చీకటిదారుల్లో
మొండి ధైర్యంతో,గుండె నిబ్బరంతో
సాహసంతో ముందుకు సాగిపోతున్న
పక్షుల్లా ఎగిరిపోతున్న ఆ వలసకూలీలను
ఆదుకునేందుకు ? ఆదరించేందుకు ?
అక్కున చేర్చుకునేందుకు?
అయ్యలారా !ఓ అమ్మలారా!
దాతలారా! ఓ ధన్యజీవులారా!
మానవత్వమున్న ఓ మారాజులారా!!
రండి రండి ! కదలిరండి కలిసిరండి!!
కరోనా వచ్చింది వలసకూలీల కడుపు కొట్టింది
ఆప్తులమై అన్నదాతలమై ఆదుకుందాం రండి!
ఆ అనాధల అభాగ్యుల ఆకలి తీరుద్దాం రండి!!



