Facebook Twitter
మీ అందచందాలే మీ కాళ్లకు బంధాలు 

ఎట్టి మనసునైనా 

ఇట్టే పరవశింపజేసే

ప్రకృతి అందాలను 

తిలకించి పులకించి

పోనివారు లేరు 

 

కానీ 

పడుచు పిల్లల  

అందాలను మాత్రం  

ఆస్వాదించక 

అనుభవించక

అనుభూతి చెందక 

 

కొంటెచూపులతో  

కొరుక్కుతినాలనుకుంటారు 

జుంటితేనెనంతా

జుర్రుకోవాలని చూస్తారు

వెర్రి వాళ్ళై వెంటపడతారు

రెండుచేతులు జోడించి వేడుకుంటారు

 

ఆపై ఇక ఆటబొమ్మల్ని

చేసి ఆడుకుంటారు

అరచేతిలో స్వర్గం 

చూపి వాడుకుంటారు

దొంగల్లా దోరవయసునంతా 

దోచుకుంటారు 

 

ఆకలి తీరిన తర్వాత 

ఎంగిలి విస్తరాకువోలె

వీధిలోకి విసిరి వేస్తారు 

ఎదురుతిరిగి ప్రశ్నిస్తే 

భయపెడతారు బాధపెడతారు

బంగారు భవిష్యత్తును 

బుగ్గిపాలు చేస్తారు 

 

ఓ అమాయకపు అమ్మాయిలూ

తస్మాత్ జాగ్రత్త 

మీ అమాయకత్వం 

మీ అజ్ఞానం 

మీ అందచందాలే 

మీ అందరి ముందరి కాళ్లకు బంధాలు 

అవి ప్రకృతి అందాలైనా

పడుచుపిల్లల పరువాలైనా

ఇది ఇంతే ఇది విశ్వంలో వింతే