వాడుబోయవాడని
బహుమాయగాడని
వలలు విసురుతాడని
మత్తుమందు చెల్లుతాడని
మాయ చేస్తాడని
ముందే హెచ్చరించకుండా
వల్లో చిక్కుకున్న తర్వాత
చెరువులో చేపల్లా వారు
గిలగిలా కొట్టుకుంటుంటే మీరు
ఎంతగా విలవిలలాడి మాత్రం
ఏమి లాభం ?
వాడు వేషగాడని
క్రూరమైన వేటగాడని
జింకలను వేటాడే జిత్తులమారని
చెట్లచాటున మాటువేసి ఉంటాడని
గురిపెట్టి బాణాలు విసురుతాడని
గుండెల్లో గుచ్చుతాడని
క్షణాల్లో ప్రాణాలు తీస్తాడని
ముందే గుర్తు చేయకుండా
బాణాలకు బలైపోయిన తర్వాత
ఎంతగా మీరు కుమిలిపోతే మాత్రం
ఏమిలాభం?
వాడు కసాయివాడని
పరమ కఠినాత్ముడని
వాడిచేతిలో కత్తులుంటాయని
అమ్మాయిలంటే బుర్రల్లేని గొర్రెలని
ఆకులు మేసే అమాయకపు మేకలని
భావించి కవ్వించి బాగా నమ్మించి
నవ్వుతూ వారి కలల్ని నరికేస్తాడని
ముందుగానే హెచ్చరించక
వాడు వారి అందాలను ఆరబోయించి
అంగడిలో సరుకులా అమ్ముకుంటుంటే
అమ్ముకొని సొమ్ము చేసుకుంటుంటే
అప్పుడు అయ్యో అమ్మో అంటూ
ఎంతగా గుండెలు బాదుకుంటే మాత్రం ఏమిలాభం?



