నిజమే కారణం నిన్న
కామంతో కలిశారో
ప్రేమతో పిలిచారో తెలియదుకాని
నేడు కెవ్వుమని కేకపెట్టి
తాను ఏడుస్తూ అందరిని నవ్విస్తూ
మహాలక్ష్మిలా ఈలోకానికి వస్తుంది
ఆ యింటికి వెలుగును తెస్తుంది
నిన్నటి భార్యాభర్తల్ని
నేడు తల్లిదండ్రులుగా మారుస్తుంది
తాను జన్మించి ఒక అమ్మకు
మాతృత్వపు మాధుర్యాన్ని
రుచి చూపిస్తుంది
అమ్మా నాన్న అంటూ పిలిచి
ఆ ఇద్దరినీ మైమరమింపచేస్తుంది
ఆమె ఎవరో కాదు ఒక ఆడపిల్ల
ఆపై ఆ పిల్లే పెరిగి పెద్దదై
తిరిగి తానే ఒక తల్లై మళ్ళీ
నవమాసాలు మోసి
మరోబిడ్డకు జన్మనిస్తుంది
పుట్టిన బిడ్డకు పాలిస్తుంది
అల్లారుముద్దుగా పెంచుతుంది
కంటికి రెప్పలా కాపాడి పెంచి పెద్దచేసి
ఈ సమాజానికి ఒక మంచి పౌరుణ్ణో
ఈ దేశానికి ఒక గొప్ప నాయకుణ్ణో
అందిస్తుంది, కానీ ఇన్ని చేసిన
ఇంత శక్తి స్వరూపిణి ఐన స్త్రీ
ఒక్కటి మాత్రం చేయలేకపోతోంది
అదే తనకిష్టమైన పాపను
తన భర్తకు అత్తామామలకు
ఇష్టమైన బాబును
మాత్రం కనలేకపోతుంది కారణం
భర్తను కలవడం వరకే
కమ్మని కలలు కనడం వరకే
తొమ్మిది నెలలు మోయడం వరకే
కడకు ఎవరినో ఒకరిని కనడం వరకే
ఆమె చేతిలో వున్నది
కాని ఎవరిని కనాలి అన్నది
మాత్రం పైనున్న పరమాత్మ నిర్ణయమే



