ఆ (జీవిత) నావలో
ఆ నడి సముద్రంలో
ఉన్నది మీరిద్దరే
వెళ్ళింది విహారయాత్రకే
స్పీడ్ బోట్ ఎక్కిన మీరు
సీరియస్ గా వున్నారెందుకు?
క్రింద ఆ నీళ్లు పైన ఆ నీలాకాశం
చుట్టూ ఆ పచ్చని ప్రకృతి
ఆ చక్కని ఆ చల్లని అందమైన ఆహ్లాదకరమైన ఆ వాతావరణాన్ని
అనుభవించక
ముద్దుముద్దుగా ముచ్చటలాడుకొని
మురిసిపోతూ
ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాల్సిన
ఆ వేళలో
అయినవి కానివి ఉన్నవి లేనివి ఊహించుకొని గుర్తుతెచ్చుకుని
మూతి ముడుసుకొని మౌనవ్రతం
దాల్చి చిరునవ్వులు చిందించాల్సిన
ఆముఖాన చీకటిని నింపుకోవడం
ఎంతవరకు సమంజసం?
విహారయాత్రలో విహరించే
ఓ విజ్ఞానవంతులారా !
విహారయాత్రలో ఆనందమే హద్దు
వినోదమే ముద్దు
అలాగే బ్రతుకుబండిని లాగే
ఓ భార్యాభర్తలారా !
విద్వేషం వద్దు విషం చిమ్ముకోవద్దు
పచ్చని కాపురంలో చిచ్చు పెట్టుకోవద్దు
ఒక్కక్షణం ఆలోచించండి
చేసిన తప్పులను ఒప్పుకోండి
ప్రేమతో ఒకరినొకరు క్షమించుకోండి
సహనంతో సర్దుకుపొండి
చిలిపి చేష్టల్లో తేనెపలుకులతో
మధుర స్మృతులతో నిండి
ప్రేమ నమ్మకమే పునాదులుగా
నిర్మించుకున్న
స్వచ్చమైన ప్రేమను పంచుకున్న
సంసారసౌధమే స్వర్గతుల్యం
నిజానికి ప్రతి విహారయాత్ర
ఒక పసందైన విందు
మానసిక వ్యధలకు బాధలకు
అది ఒక మంచి మందు



