Facebook Twitter
కాలమే కరుణిస్తే...?

నేడు...
రేయింబవళ్లు
శ్రమించే స్వేదం
చిందించే సేవకులే..!
రేపటి...యజమానులు
కోట్లకు పడగలెత్తే కోటీశ్వరులు..!

నేటి.....చురుకైన బాలలే..!
రేపటి...భావిభారత నిర్మాతలు..!

నేడు....కమ్మని కలలుకనే కన్యపిల్లలే..!
రేపు....తన్మయత్వంలో మునిగే కన్నతల్లులు..!
మాతృత్వాన్ని రుచిచూసే మాతృమూర్తులు!

నేటి....కొంటె కోడళ్లే..!
రేపు...పెత్తనాన్ని
చెలాయించే గడుసు అత్తలు..!

నేటి.....అమ్మనాన్నలే..!
రేపటి...అవ్వతాతలు..!
నేటి.....అవ్వతాతలే..!
రేపటి...అనాధలు..‍.అస్థిపంజరాలు..!

నేడు...సిగ్గుపడే పూలమొగ్గలే..!
రేపు....నవ్వులు రువ్వే పువ్వులు..!

నేడు...మట్టిలో రాలిన విత్తనాలే..!
రేపు....ఆకాశాన్నంటే మర్రివృక్షాలు..!

నేడు...ముసిరే చీకటి రాత్రులే..!
రేపు....కురిసే పండువెన్నెలలు..!

నేడు....ఓర్పుతో సహించిన ఓటమే..!
రేపటి...ఘనవిజయానికి సోపానం..!

నేటి.....చింతలు చీకాకులే..!
రేపటి...చిరునవ్వుల చిరుగాలులు..!

నేటి.....ప్రయత్నాలే..!
రేపటి...ప్రతిఫలాలు..!
నేటి.....ప్రామాణికమైన ప్రణాళికలే..!
రేపటి...అఖండవిజయానికి పునాదిరాళ్ళు!