Facebook Twitter
అమృతం కన్న అమ్మ ప్రేమే మిన్న..!

నాకు దాహం వేస్తుంది...!
అది నన్ను దావాలనంలా
నిత్యం దహించి వేస్తుంది

నాడు నేను అమ్మగర్భాన్ని
చీల్చుకున్ననాడు అమ్మ ఒడిలో
వొరిగిననాడు పెరిగిననాడు
ఉగ్గుపాల కోసం ఊయల్లో ఊగేవేళ
"కమ్మనైన అమ్మపాలు"త్రాగాను...కానీ

అమ్మపాలకోసం...నే ఆశపడిననాడు
నాకు "చిక్కని ఆవుపాలు" దొరికాయి
నేను ఆవుపాలకోసం ఆశపడితే...
నాకు వేడివేడి "తాజ్ మహల్ టీ" దొరికింది

నేను వేడివేడి తాజ్ మహల్ టీ కోసం
పరుగులు పెట్టిననాడు....
నాకు"తాజా యాపిల్ జ్యూస్" దొరికింది
నేను తాజా యాపిల్ జ్యూస్ కి ఆశపడితే...
నాకు "ఖరీదైన బ్రాండెడ్ విస్కీ"దొరికింది

అలా అలా ఫారిన్ బ్రాండ్ కు బానిసనై
బార్ లో మందు కొట్టి కొట్టి బోర్ కొట్టి
అడవిలో ఆకలిగొన్న చిరుతపులిలా
రౌడీనై రాక్షసుడనై మనుషుల
"రక్తపు చుక్కలకు రుచి"మరిగాను
ఆ ఎర్రనిబ్రాందీ త్రాగిన నాకు
"అమృతపు చుక్కల మీద ఆశ" కలిగింది

ఆ అమృతపుధారల కోసం
సప్తసముద్రాలను దాటాను
కొండాకోనల్లో ఎండావానల్లో
తిరిగాను ఎడారుల్లో వెతికాను
ఎక్కడా దొరకలేదు కానీ
ఒక ఆచూకి మాత్రం దొరికింది

అదే "అమ్మే ఒక దేవతని"...
ఆ "అమ్మ ప్రేమే అమృతమని"...
ప్రేమించే అమ్మను పూజించమని...
ఆ ప్రేమామయి పంచే
"ప్రేమామృతాన్ని" త్రాగి తరించమని....