Facebook Twitter
వికసించిన పుష్పం ...తుంటరి తుమ్మెద …

వికసించిన పుష్పం పైనే

తుంటరి తుమ్మెద వాలుతుంది

మకరందాన్ని గ్రోలుతుంది

ఆకలిని తీర్చుకుంటుంది

ఆనందంగా హాయిగా

ఆకాశంలో ఎగురుతుంది

 

వికసించిన పుష్పం

ఝమ్మంటూ నాదంచేసే

తుంటరి తుమ్మెదను

విందుకు రమ్మంటుంది

ప్రేమతో పిలుస్తుంది, ఎంతో

ఆశతో ఎదురు చూస్తుంది

 

వికసించిన పుష్పం పైవ్రాలి

మత్తెక్కిన ఆ తుంటరితుమ్మెద

మకరందాన్ని గ్రోలుతూవుంటే

పుష్పం పులకించి పోతుంది

మైమరచిపోతుంది

 

తుమ్మెద

ఏమాత్రం ఆలస్యం చేసినా

ఎండకు పుష్పం 

ఎండిపోతుంది మాడిపోతుంది

వాడిపోతుంది నేల రాలిపోతుంది

అది ప్రకృతి ధర్మం పరమాత్మ నిర్ణయం

 

సమయం మించిపోతే

తుంటరితుమ్మెద కుమిలికుమిలిపోతుంది

మరో పుష్పంకోసం వెదుక్కుంటూ వెళ్తుంది

 

అందుకే

ఏ వికసించే పుష్పమైతే

తుంటరి తుమ్మెదకు మధురమైన 

మకరందాన్ని అందిస్తుందో

 

ఏ వికసించే పుష్పమైతే

అందమైన సుందరాంగి

ముంగురులో చేరి మురిసిపోతుందో

 

ఏ వికసించే పుష్పమైతే

గర్భగుడిలో దైవం మెడలోని 

పూలమాలను చేరి పులకించిపోతుందో

ఇక దాని జన్మ ధన్యమైనట్లే

 

ఎంతకాలం జీవించామన్నదికాదు ముఖ్యం

ఎలా జీవించాము, జీవించినంత కాలం 

ఎంత నీతిగా బ్రతికామన్నదే, ఎంతమందికి

నిస్వార్థంగా ఉపకారం చేశామన్నదే ముఖ్యం