మొన్న...చెట్లమీది కోతుల్లా
అమ్మ తినిపించిన గోరుముద్దలతో
తోటి పిల్లల అల్లరిచేష్టలతో ఆటపాటలతో
బడిలో మాస్టారు తీయించినగుంజిల్లతో
నాన్న తిట్టిన తిట్లతో పెట్టిన చీవాట్లతో
ఒక బంగారు బాల్యం..."ఏడు రంగుల
ఇంద్రధనుస్సులా" ఇంపుగా సాగింది
నిన్న...వింతైన వికృత మనస్తత్వాలతో
కొంతైనా అవగాహన ఆలోచన లేక
వివాదాలల్లో ఇరుక్కుని ఒకరిపై ఒకరు
విరుచుకుపడుతూ విషం చిమ్ముకుంటూ
భార్యా భర్తలిద్దరు విధిలేక విడిపోగా
విడాకులు తీసుకోగా ఆ కలహాల కాపురాన
ఒక బంగారు బాల్యం..."ఆగనికన్నీటి గాథైంది"
నిన్న...కరోనా మహమ్మారి
కన్నవారిని కాటికీడ్చగా
అనాధలైన పసిబిడ్డలు
వీధుల్లో చెత్త ఏరుకుంటూ
బస్టాండుల్లో బిక్షమెత్తుకుంటూ
రాతృల్లో రైల్వేప్లాట్ ఫారాలపై నిద్రిస్తూ
ఆకలితో అలమటిస్తూ అస్థిపంజరాలై
చెత్తకుండీల చెంత మెతుకులకోసం
కుక్కలతో కుస్తీపడగా ఒక బంగారు బాల్యం
వీధిలో విసిరిన "ఎంగిలి విసరాకైంది"
నేడు...ఇంగ్లీష్ చదువుల
మోజులోపడి విద్య వ్యాపారమై
ఖరీదైన కార్పోరేట్ స్కూళ్ళల్లో
కరోనా భయంతో ఆన్లైన్ పాఠాలతో ఇళ్ళల్లో
కార్పోరేట్ కోరల్లో...ఒక బంగారు బాల్యం
పంజరంలో చిలకల్లే "బంధీఐపోయింది"
అందుకే ఓ తల్లిదండ్రులారా!
ఓ విజ్ఞులారా ! ఓ వివేకులారా! తస్మాత్ జాగ్రత్త
నేటి బాల్యమే రేపు "చీకటిలో చిరుదీపం"
నిన్న పుట్టి...నేడు వికసించి...రేపు గుబాళించే
బంతిపువ్వులాంటి "బంగారు బాల్యం"
నేడిలా బలైపోతూవుంటే...బంధీఐపోతూవుంటే
చితికిపోతూవుంటే...చీకటిలో చిధ్రమైపోతూవుంటే
రేపీసమాజం చెల్లించుకోక తప్పదు "భారీ మూల్యం"



