Facebook Twitter
సమస్యలు సంకెళ్లు 

కొన్ని సమస్యలొచ్చి 

తిష్టవేస్తాయి

ఇంట్లో అతిథుల్లా

ఒంట్లో మొండివ్యాధుల్లా

 

కొన్ని సమస్యలొచ్చి 

పీడిస్తాయి పీడకలల్లా

పిచ్చిచేష్టలు చేస్తాయి 

పీకలు పిసికేస్తాయి పిచ్చివాళ్ళలా

ఉక్కిరిబిక్కిరి చేస్తాయి 

ఊపిరి తీస్తాయి పిశాచుల్లా

పీక్కుతింటాయి రాబందుల్లా

 

కొన్ని సమస్యలు సంసారుల చుట్టే  

సమాధుల్లా నోరు తెరుచుకుంటాయి 

కొన్ని సమస్యలు మధుర సంగీతాన్ని 

కొన్ని విషాద సంగీతాన్ని వినిపిస్తాయి 

 

సమస్యలు లేనిదెవరికీ 

సన్యాసులకే

సమస్యలకు భయపడి 

పారిపోయే పిరికిపందలకే

కానీ నిత్యం సమస్యల

సుడిగుండాలలో చిక్కుకుపోయేది

సతమతమయ్యేది సహవాసం చేసేది 

సహనంతో సర్దుకుపోయేది సంసారులే

 

ఆకాశంలో విహరిస్తున్న

సముద్రగర్భంలో దాక్కున్న

ఈ భూమిపై బ్రతుకుభారం మోస్తున్న 

వారంతా సమస్యల సంకెళ్ళెకు బంధీలే 

సమస్యల విషసర్పాల కోరలకు బలైనవాళ్ళే