కలిసివుంటే కలదు సుఖం
నిన్న...కొమ్ములు తిరిగిన
నాలుగెద్దులు దుమ్ము రేపుతూ
తిరుగుతూవుంటే మేత మేస్తుంటే
దడపుట్టిన పులి చెట్లచాటున
గుట్టలమాటున నక్కినక్కి తిరిగింది
ధైర్యం చేసి కాస్త దగ్గరకొస్తే
కొమ్ములతో ఎద్దులు కుమ్మేశాయి
పాపం పులి పరుగులు తీసింది
నేడు...నాలుగు ఎద్దులు ఒద్దికలేక
నాలుగుదారుల్లో నడుస్తుంటే
శతృవుల్లా దూరదూరంగామేస్తుంటే
గమనించిన పులి గట్టిగా గర్జించింది
మెల్లగా ఒక్కో దానిమీద విరుచుపడి
గొంతు కొరికి,గర్వతో గంతులువేసింది
ఆ మూగ జంతువుల మృత్యువాతకు
ముఖ్యం కారణం ఐక్యత సఖ్యత లేకనే
కలిస్తే కలదు విజయం విడిపోతే విషాదం
కలిసి మెలిసి సమిష్టిగా ఉన్న చలిచీమలు
బుసకొట్టే సర్పాలను సైతం సంహరిస్తాయి
ఏనుగులైతేనేమి?ఎద్దులైతేనేమి? విడిపోతే
అడవిలోని కౄరమృగాలకు ఆహారమౌతాయి



