Facebook Twitter
పురోభివృద్ధికి పునాదిరాళ్ళు

ఉద్యోగం అంటే 

ఉగాది పచ్చడి కాదు

సంక్రాంతి సంబరం కాదు

 

ఉద్యోగం అంటే  ఒక బాధ్యత 

ఉద్యోగం అంటే  ఒక కర్తవ్యం

 

కాని, నిజానికి ఉద్యోగమంటే 

అందరికీ అర్థంకాని‌ ఆర్థికపరమైన 

సైలెంట్ గా జరిగే ఓ శ్రమదోపిడి

 

మన కళ్ళముందే మన కష్టాన్ని 

మరొకరు నోట్లకట్టలుగా

మార్చుకుంటూ వుంటారు 

కోట్లల్లో ఆదాయాన్ని ఆర్జిస్తూ వుంటారు

మనల్ని మెట్లుగా మార్చుకొని

ఎవరెస్ట్ శిఖరంలా వారు ఎదుగుతూ వుంటారు

బోనస్ కొంచెం మనకు పంచుతారు

బిక్షగాళ్ళపాత్రలో చద్దన్నంలా వేస్తారు

 

మనం మాత్రం దినదినం 

చిల్లర పోగేసుకుంటూ నెలనెలా 

జీతాలను అడుక్కుంటూ

ఎదుగు బొదుగులేకుండా జీవిస్తుంటాం

బానిసల్లాగా బతికేస్తుంటాం 

 

చట్టపరంగా మనకు ఎన్నిహక్కులున్నా

అనేక చిక్కులుపెట్టి, అనేక మెలికలుపెట్టి

అనేక చర్చలు, సమ్మెలు, పోరాటాలు 

ఏళ్ళతరబడి చేసినా సరే, చివరకు 

మన సిబ్బందిని బాగా ఇబ్బంది పెట్టి

ఎంగిలి విస్తరాకుల్లో విసిరేస్తారు ఇన్ని 

ఎరియర్స నే పచ్చడిమెతుకులు

 

ఎందుకో సంస్థ యజమానులకు 

ప్రభుత్వ ప్రతినిధులకు

ఉద్యోగుల జీతాలు పెంచడానికి

మనసు రాదు ఆ సమయంలో వారి

చేతుల్లో చలనముండదు

పెన్నుల్లో ఇంకుండదు

కాళ్ళలో కదలిక వుండదు

హృదయంలో స్పందన వుండదు

 

కాని ఒక్కటి మాత్రం పచ్చినిజం

ఏ సంస్థకైనా కష్టమర్లే కళ్ళకుకనిపించే దేవుళ్ళు

ఉద్యోగస్తులే దాని పురోభివృద్ధికి పునాదిరాళ్ళు