అందం అశాశ్వితం...ఆరాధించడం అవివేకం...
చిరునవ్వులు చిలకరించి
చిత్తాన్ని రగిలించి
మన్మధ తాపాన్ని రేపే
ఓ మదన మోహినీ !
మయూరిలా కులికి కులికి
తొలకరి వలపులు చిలికి చిలికి
కలలో సైతం కవ్వించి నవ్వించే ఓ కలికీ!
నిన్న నీ అందం గంధంకన్నా
మకరందంకన్నా మధురమనుకొని
మతిచలించి భ్రమించి ఆశపడి
అర్రులు చాచిన ఓ అవివేకిని...
నీ అందాన్ని అందుకోవాలని
జున్నులా జుర్రుకోవాలని
వెంటబడిన ఓ వెర్రివాడిని...
నేడే ఈనాడే అర్థమైంది నా కళ్ళకి
పైట "లేచే" పడుచుపిల్లకి
అందం అతిసహజమని...
ఆ అందం అశాశ్వితమని...
అశాశ్వతమైన ఆ అందాన్ని
ఆరాధించడం అవివేకమని...
ఎర్రగా బుర్రగా ఉన్న ఓ కుర్రదానా !
ప్రపంచ సుందరిని నేనంటూ
తెగ విర్రవీగిపోకే ఓ వెర్రిదానా !
నీ వయసు ముదిరే... నీ అందం చెదిరే...
రోజొకటి నీ ముందరే వుందన్న
ఒక పచ్చినిజం తెలుసుకోవే పిచ్చిదానా!



