ఇరుగుపొరుగు వారి
మాటలకు విలువనిచ్చి
మనసులు కలవక
మాటా మాటా పెరిగి
గుట్టుగా కాపురం చేసే
కిటుకు ఎరుగక రోడ్డెక్కిరోజూ
తిట్టుకుంటూ కొట్టుకుంటూ
కలతలతో కన్నీళ్ళతో కాలంగడుపుతూ
ఉండేది ఒకే ఇల్లైనా
పడుకుండేది ఓకే మంచైనా
ఎడమొహం పెడమొహంగా పడుకుంటూ
"మాంగల్య బలాన్ని మామిడాకులను" మరచి
విడాకులను గురించే దీర్ఘంగా ఆలోచించే
"జగడాలమారి ఏ జంటైనా"
"తెలుసుకోవలసిన సత్యమొక్కటే"...
"సుఖసంసారానికి సూత్రమొక్కటే"...
"కొత్తకాపురం ఒక తక్కెడని
రెండువైపులా రెండు వందల గ్రాముల
ప్రేమేవుంటే ఇక ఎక్కువతక్కువ తేడాలెక్కడని"?
విడిపొండి విడిపోండి కలిసి వుంటే మీరు
కాపురం చేయలేరనే వారి సలహాలు స్వీకరించకండి
విడిపోతే విషాదమని బ్రతుకు నరకమని
కలిసివుంటేనే కలదుసుఖమన్నవారి కాళ్ళకు మ్రొక్కండి
ఔను భిన్నధృవాలైనా భిన్నమనస్కులైనా
భిన్నాభిరుచులున్నా భిన్నాభిప్రాయాలున్నా
విభిన్నమైన వాతావరణంలో తిరిగి పెరిగినా
మూడుముళ్లతో...ఏడడుగులతో... ఒక్కటై
"ఒకే మాట... ఒకే బాణం... ఒకే భార్య"...అన్న
పుణ్యదంపతులైన ఆ సీతారాములజంటను
ఏ జంటైతే ఆదర్శంగా భావిస్తుందో బ్రతుకుతుందో
ఆ జంటే... ఆదర్శవంతమైన జంట
ఆ జంటే... దేవతలు దీవించిన దివ్యమైన జంట
ఆ జంటే... ఒకరినొకరికి జతచేసి తాళితో బంధించి
ఆ భగవంతుడు అందించిన ఓ బంగారుబహుమతి



