అమ్మ ఇచ్చిన కమ్మని పాలు
కడుపు నిండా త్రాగి
నోట్లో వేలెట్టుకొని
ఊగి ఊగి ఊయల్లో
ఆదమరచి కంటినిండాహాయిగా
నిద్రపోతుంది ఓ చంటి పాప
ఎద్దులు తోలుకొని
పొద్దుగాల పొలాని కెళ్ళి
దుక్కిదున్ని స్వేదం చిందించి
ఆదమరచి కంటినిండాహాయిగా
నిద్రపోతాడు సేద్యం చేసే రైతన్న
కొండలమీద బండలుమోసి
బద్దలు చేసి కూడింత దిని
చెట్టుకింద కునుకుతీసే ఓకూలన్న
ఎర్రని ఎండలో కట్టెలు కొట్టి
కండలు కరిగించిన ఓ కష్టజీవి
అప్పులన్నీ తీరిపోయిన
ఓ మధ్య తరగతి ఉద్యోగి
ఆదమరచి కంటినిండా
హాయిగా నిద్రపోతారు
గాఢనిద్రలోకి జారిపోతారు
నిద్రలేక కంటికి కునుకురాక
పక్కమీద దొర్లేదెవరు ?
కోటీశ్వరులు కొందరు
ఉన్నదాన్నెవరైనా
దోచుకుంటారేమోని
అనుమానంతో ప్రాణభయంతో
కంటి మీద కునుకు వుండదు
నైట్ డ్యూటీ చేసే శ్రామికులకు
భగ్న ప్రేమికులకు
శోభనం రాత్రి పడకగదిలో
పూలపాన్పుపై పవళించిన
పడుచు జంటలకు
కంటి మీద కునుకు వుండదు
కంప్యూటర్ ఇంజనీర్లకు
కారుచీకట్లో తిరిగే దోపిడి దొంగలకు
కంటి మీద కునుకు వుండదు



