Facebook Twitter
పాపం...ఆశిల్పిఆకలి తీరేదెలా?

నిన్న పగలురేయి శ్రమించి 

తన రక్తాన్ని స్వేదంగా మార్చి 

ఓ బక్కశిల్పకళాకారుడు

చక్కగా చెక్కిన ఓ సుందరశిల్పం

నేడు గర్భగుడిలో భక్తులచే

అర్చనలు అభిషేకాలందుకుంటుంది

ఉత్సవాలపేర ఊరంతాఊరేగుతుంది

నిన్న‌ ఎన్నో కమ్మని కలలుగన్న 

ఆ శిల్పి నేడు తానే "ఒక శిలగా" మారాడు

 

కారణం నేడా శిల్పకళాకారుడు....

జీవితంలో చిక్కులు చీకాకులు

చింతలు చీకటి తప్ప వెలుగన్నదసలు 

ఎరుగనివాడు "పైకి ఎదగనివాడు"

 

నేడా శిల్పకళాకారుడు...

ఆస్తిపాస్తులేవీ 

ఆర్జించని " ఓ అమాయకుడు"

భార్యాబిడ్డలను 

పోషించలేని "ఓ అసమర్థుడు"

చిమ్మచీకటిలో పూరిగుడిసెలో ఆకలితో 

అలమటిస్తున్న "ఓ అస్థిపంజరం"

 

నేడా శిల్పకళాకారుడు.... 

సుఖసంతోషాల రుచితెలియక

తెలివిగా బ్రతుకుబండిని ఈడ్చలేక

సంసార సాగరాన్ని ఈదలేక

గుడిముందర పడివున్న "ఓ భిక్షగాడు" 

 

నిన్న శిలను,ఉలిని,సుత్తినే

నమ్ముకున్న ఆశిల్పకళాకారుడు.... 

నేడు తన స్వశక్తినే నమ్ముకుని

భగవంతుని బొమ్మల్ని అంగడిలో 

అమ్ముకుంటున్న" ఓ ఆశాజీవి"

 

కానీ ఎంతటి శిల్పకళాకారుడైనా

శ్రమపడి శిలను ఉలితో చెక్కగలడే

కాని,ఆ శిలలకింత ఊపిరి పొయ్యలేడు

కదలని ఆ శిలలను కన్నీటితో కరిగించలేడు

తన క్షుద్బాదను ఆ విగ్రహాలకు వినిపించలేడు

 

నాడా శిలలను చెక్కడానికి

సుందర శిల్పాలుగా మార్చడానికి

సుత్తితో ఓశిల్పాన్ని ఎన్నిదెబ్బలు కొట్టాడో ఏమో

నేడు జీవితంలో అన్ని శ్రమలనూ అభవిస్తున్నాడు

పాపమదే ఆశిల్పికి శాపమేమో అదిపరమాత్మకే ఎరుక