Facebook Twitter
ప్రకృతిధర్మమే...సృష్టిమర్మమే

తప్పించుకొనే దారి వెతుకుతూ 

భయంభయంగా బెదురుచూపులు 

చూసే జింకలు పిరికివే కావచ్చు...

 

కాని ప్రమాదాన్ని ముందే పసిగట్టి

పొదలమాటున పొంచి పొంచి వున్న 

శత్రువును కనిపెట్టి వేగంగా అతివేగంగా 

ప్రాణభయంతో పరుగులు పెడుతున్నప్పుడు...

 

ఆకలిగొన్న పెద్దపులిని సైతం అటూ... ఇటూ

తిప్పితిప్పి...ముప్పుతిప్పలు పెడుతున్నప్పుడు...

రాళ్ళురప్పలమీద...ముండ్లతుప్పలమీద 

చెంగుచెంగున దూకి తప్పించుకుంటున్నపుడు...

 

ఎవరి సహాయాన్ని ఆశించక

రక్షించమని ఆ పరమాత్మను సైతం అర్దించక

శక్తికి మించి శ్రమిస్తున్నప్పుడు...

అవెంత యుక్తిగలవో...శక్తిగలవో అర్థమౌతుంది

 

ఆకలేస్తే ఆహారంకోసం... దాహమేస్తే నీటికోసం

అడవిలో స్వేచ్చగాతిరిగే అమాయకపు జింకలు

పొంచివున్న ప్రమాదాల్ని పసిగట్టలేక పులులకు

ఆహారమై వాటి ఆకలిని తీర్చడం... ప్రకృతి ధర్మమే

సృష్టి మర్మమే... అంతుచిక్కని ఓ వింత రహస్యమే