Facebook Twitter
ప్రతిమనిషిఆ పరమాత్మ స్వరూపమే...

నిరాకారుడైన

ఆ భగవంతుడు కోరుకునేది

భక్తులు సమర్పించే కోట్లు ఖరీదుచేసే

బంగారు ఆభరణాలా

అందమైన అలంకరణలా ? లేదే

ఫల పుష్పాదులతో

ధూపదీప నైవేద్యాలతో

సుగంధ ద్రవ్యాలతో సుప్రభాత వేళ

నిస్వార్థంగా నీతిగా నిజాయితీగా

నియమనిష్టలతో నిత్యం

నీవు చేసే నిజమైన పూజలు

హారతులు అర్చనలు అభిషేకాలే కదా

 

సర్వాంతర్యామియైన

ఆ భగవంతుడు కోరుకునేది

కోట్లు ఖర్చు చేసి నీవు నిర్మించే

అందమైన సుందరమైన కోవెలా? కాదే

నిర్మలమైన నిష్కల్మషమైన

జాలి ప్రేమ కరుణ దయ క్షమా

సద్గుణాలకు నిలయమైన

నీ హృదయ దేవాలయమే కదా

 

ఆ భగవంతుని విగ్రహాన్ని

ఆ సుందర దేవతా శిల్పాన్ని

ఆ గర్భగుడిలో ప్రతిష్టించేది

కళ్ళెంలేని గుర్రంలా, ప్రాపంచిక

విషయాలవెంట పరుగులుపెట్టే

నీ చంచలచిత్తంలో ఏకాగ్రత కోసమే

నీలోని కోపతాపాల నిగ్రహం కోసమే

ఆ భగవంతుని చల్లని అనుగ్రహం కోసమే

 

ఈ నగ్నసత్యాన్ని గుర్తెరిగి,పరిణితి చెంది

ప్రతి మనిషిలో నీవు ఆ పరమాత్మను

దర్శించగలిగితే నిజంగా నీ ఈ జన్మధన్యమే