Facebook Twitter
అదృష్టం + హార్డ్ వర్క్ = సక్సెస్

కాలం...
కలిసి వచ్చిన వారు...ధనవంతులు
గుణవంతులు...అదృష్టవంతులు...

కాలం...
కాలసర్పమై పగబట్టి చాటుమాటుగా కాటు వేసిన వారు...విధివంచితులు
దుఃఖితులు...దురదృష్టవంతులు...

కొందరు గెలుపు గుర్రాన్ని
కొందరు ఎవరెస్టు శిఖరాన్ని
అధిరోహించాలనుకుంటారు

కొందరిని అనుకోని అదృష్టం
అరుదైన బంగారు అవకాశం
ఒక గజరాజులా వచ్చి మెళ్ళో
గజమాలనేసి రాజును చేయవచ్చు

కానీ కాలం కలిసి రాకపోతే
నెత్తిన పిడుగులు పడవచ్చు
సునామి చుట్టు ముట్టవచ్చు
అగ్నిపర్వతాలు బ్రద్దలు కావొచ్చు
అరికాళ్ళ క్రింద భూమి కదిలిపోవచ్చు అథఃపాతళానికి దిగిపోవచ్చు
ఉక్కుసంకెళ్ళతో బంధింపబడవచ్చు

ఐనా విషం చిమ్మే
విధిని ఎదిరించవచ్చు
విజయాన్ని సాధించవచ్చు
సాహసమే మీ సంకల్పమైతే...!
ఆత్మవిశ్వాసమే మీ ఆయుధమైతే..!

మీరు విశ్వవిజేతలు కావొచ్చు
అదృష్టం + హార్డ్ వర్క్ = సక్సెస్
అన్నది మీ సుఖజీవన సూత్రమైతే...!