Facebook Twitter
ఎక్కండి ఎవరెస్టు శిఖరం..!

ఆత్మీయులెవరు..?
ఆపదలో అమ్మలా
నాన్నలా ఆదుకునేవారు..!

అభిమానులెవరు..?
ఆకాశమంత ఎత్తుకు
ఎదిగిన వారిని...
అఖండ విజయాలను
సాధించిన వారిని...
ఆలింగనం చేసుకుని
అభినందించేవారు
పూలవర్షం కురిపించేవారు
ఘనంగా సత్కరించేవారు..!

ఆదర్శవంతులెవరు..?
ఆశలు రేపే వారు
కష్టేఫలి అనేవారు
కలలు కనమనేవారు
సమ సమాజ నిర్మాతలు
సుఖజీవన స్పూర్తి ప్రదాతలు..!

నిజమైన
ప్రాణ మిత్రులెవరు..?
నిన్ను వెన్ను...తట్టేవారు
భయమెందుకంటూ
పద ముందుకంటూ
ముందుకు నిన్ను...నెట్టేవారు..!

సంఘ సంస్కర్తలెవరు..?
తరతరాలుగా నరనరాల్లో
సమాజంలో పేరుకుపోయిన
రుగ్మతల్ని రూపుమాపేవారు
కులమత పిశాచులకు
సమాధులు...కట్టేవారు
నవసమాజ నిర్మాణం...చేపట్టేవారు..!

త్యాగ ధనులెవరు..?
పరులహితం కోరేవారు
సకల సుఖాలను సౌఖర్యాలను
కడకు తమ ప్రాణాలను సైతం
తృణప్రాయంగా...త్యజించేవారు..!

విశ్వ విజేతలెవరు..?
కింద పడిపోయినా కడలి
కెరటాల్లా పైకి లేచేవారు
ఎన్ని అడ్డంకులెదురైనా...
ఎన్ని అవాంతరాలొచ్చినా...
ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా...

ఎవరెంతగా వెనక్కి లాగినా...
ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా...
కసికి కృషికి సాహసికి శ్రమజీవికి
ఎదురేలేదని నిరూపించేవారు...!
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేవారు..!