Facebook Twitter
అరచేతిలో అణుబాంబు..?

మిత్రమా..!
ఓ నా ప్రియ నేస్తమా..!
నీ చేతిలో ఉన్నది...రత్నమని...
వజ్రమని భ్రమపడుతున్నావేమో..!
కాస్త గమనించు అది ఒక...రాయేమో..!

మిత్రమా..!
ఓ నా ప్రియ నేస్తమా..!
నీ చేతిలో ఉన్నది నీకు...ఆనందామృతం
పంచుతుందని భ్రమపడుతున్నావేమో...!
కాస్త గమనించు...అది
వినోదంపేర నీపై విషం చిమ్ముతుందేమో..!

మిత్రమా..!
ఓ నా ప్రియ నేస్తమా..!
నీ చేతిలో ఉన్నది నీకు...ప్రేమామృతం
పంచుతుందని భ్రమపడుతున్నావేమో..!
కాస్త గమనించు...అది నీ స్నేహబంధాలను...అనుబంధాలను
భవబంధాలను.....రక్తసంబంధాలను
భస్మం చేసే భస్మాసుర హస్తమేమో..?

మిత్రమా..!
ఓ నా ప్రియ నేస్తమా..!
నీ చేతిలో ఉన్నది
బంగారు లేడియని...
భ్రమపడుతున్నావేమో..?
ఒక్కసారి గమనించు...అది
ముద్దులు పెట్టే మృత్యువేమో..? దాని
విషకౌగిలి దృతరాష్ట్రుని కౌగిలియేమో..?

మిత్రమా..!
ఓ నా ప్రియ నేస్తమా..!
నీ చేతిలో ఉన్నది
నిన్ను ప్రేమించే ప్రపంచ
సుందరియని భ్రమపడుతున్నావేమో..?

ఒక్కసారి గమనించు ...
అది నీకు బద్దశత్రువేమో..?
నీ ఆరోగ్యానికి గోడ్డలి పెట్టేమో..?
ఊబిలో త్రోసి నీ ఊపిరి తీస్తుందేమో..?
బలిపశువునుచేసి బలితీసుకుంటుందేమో
"అరచేతిలో అణుబాంబై" ‌నిన్ను
అంతంచేస్తుందేమో జరాజాగ్రత్త మిత్రమా!