మరణములేని మంచితనము
బాల భాస్కరుడై
తూర్పున ఉదయించాలి...
ఓర్పుతో నేర్పుగా ఊహించని
మార్పుకోసం ఉద్యమించాలి...
మంచితనం...మానవత్వం...
మనిషికి రెండు కళ్ళు కావాలి
మంచితనంతో...
ఇతరుల మనసును గెలవవచ్చు
విజేతగా నిలవవచ్చు
మానవత్వంతో...
దాతృత్వం చూపవచ్చు
దైవత్వానికి ప్రతిరూపంగా మారవచ్చు
కొందరు
అహంకారులు
నీ మంచితనాన్ని
బలహీనతగా భావించినా
నీలోని మంచితనం
మోడువారిన చెట్టు కారాదు
అది నిత్యం చిగురిస్తూనే ఉండాలి
మంచిచేసే మనిషికే...తప్ప
మంచికి లేదు మరణమన్న...
తనకు మాలిన ధర్మం
మొదలు చెడ్డ బేరమన్న...
బ్రతుకుసూత్రం మాత్రం మరచిపోరాదు
అందుకే నిద్రలో సైతం
నీ శతృవులు నిన్ను కలవరించేలా...
మానవత్వం నీలో పరిమళించేలా...
నీ మంచితనాన్ని గట్టిగా...ముద్రించు...
ఆపై ప్రశాంతంగా...నిర్మలంగా...
నిశ్శబ్దంగా నింగిలో తారలా...నిద్రించు...



