నీ పైన ఏమున్నది..?
నీ క్రింద ఏమున్నది..?
నీ చుట్టూ ఏమున్నది..?
అన్న దానికన్నా...నీలో
ఏమున్నది..? అన్నదే మిన్న..!
నీ తలపై ఏమున్నది..?
అనంతమైన ఆకాశమున్నది...అచట
అంతుచిక్కని రహస్యాలనిధి ఉన్నది
ఆ నిధిని అన్వేషించమన్నది
ముందుతరాలకు అందించమన్నది..!
నీ కాళ్ళ క్రింద ఏమున్నది..?
నేల ఉన్నది మట్టి వాసననున్నది
ఆ మట్టిలో పుట్టిన ప్రతిమనిషి
ఆ మట్టిలోనే పెరిగి...
ఆ మట్టిలోనే తిరిగి...
ఆ మట్టి గింజల్నే తిని...
ఆ మట్టిలోనే కలిసిపోక తప్పదన్న
ఆ మట్టి సందేశాన్ని మరిచిపోకన్నది..!
నీ చుట్టూ ఏమున్నది...?
అద్భుతమైన ఒక ప్రపంచమున్నది
అందులో ఆనందామృతమున్నది
త్రాగమన్నది
అందులో సంతోష సాగరమున్నది
ఈదమన్నది...
సుఖదుఃఖాలు సుడిగుండాలు
చీకటి వెలుగులు...చిరునవ్వులు
కన్నీళ్లు ఉన్నాయి కలతచెందక కన్నది
సాహసంతో ముందుకు సాగిపొమ్మన్నది
అన్నింటికీ మించి నీలో ఏమున్నది..?
పరమాత్మకు ప్రతిరూపమైన ఆత్మ ఉన్నది
అదే నీ ప్రాణం...
అదే నీ ఊపిరి...
అదే నీ శ్వాస అన్నది...
ఆ శ్వాస మీద ధ్యాస ఉంచమన్నది...
నిన్ను మృత్యువు ముద్దాడే లోపు
మరువక మంచి చేయమన్నది...
అందరినీ ప్రేమించమన్నది...
ఆ ప్రేమను పదిమందికి పంచమన్నది...
ఆపదలో ఉన్న వారిని ఆదుకోమన్నది...
మానవత్వంతో...దాతృత్వంతో...
దైవత్వంతోనే...నీ జన్మ సార్థకమన్నది...
ఆ మూడే మోక్షానికి దగ్గరి దారులన్నది...



