కష్టాలు కన్నీళ్లు
కలతలు కలహాలు
చింతలు చీకాకులు
వివాదాలు విడాకులు
సహజమే సంసారమన్నాక...
భయపడకండి...
కలవరపడకండి...
కంగారు పడకండి...
ధైర్యంగా ఉండండి...
నిప్పంటుకున్న
తారాజువ్వ ఏంచేస్తుంది..?
రివ్వుమని నింగి కెగురుతుంది
కోరలుచాచే కోడెనాగు
తోకత్రొక్కితే ఏంచేస్తుంది..?
కస్సుమంటుంది కాటు వేస్తుంది
గట్టిగా నేలకేసి
కొట్టిన బంతి ఏం చేస్తుంది..?
అంతే వేగంగా గాలిలో పైకి లేస్తుంది
చీకటిగదిలో బంధించి
కొరడాలతో కొట్టిన పిల్లి ఏంచేస్తుంది..?
మీద మీద పడి రక్కుతుంది
రక్తం రుచి చూస్తుంది
దెబ్బతిని తప్పించుకున్న
బెబ్బులి ఏంచేస్తుంది..? కసితో
తిరిగి వేటగాన్నే వేటాడుతుంది
తిన్నగా తీరం దాటిన
తీవ్ర తుఫాన్ ఏం చేస్తుంది..?
విలయతాండవం చేస్తుంది
భారీ విధ్వంసాన్ని సృష్టిస్తుంది
పచ్చని పొలాల్ని
పొట్టన పెట్టుకుంటుంది ఆపై
చితికిన అన్నదాత బ్రతుకు
చిరిగిన ఓ ఇస్తరౌతుంది
ఆస్తిఉన్న అస్థిపంజరమౌతుంది
బ్రద్దలవడానికి సిద్దంగా వున్న
అగ్నిపర్వతం ఏం చేస్తుంది..?
ఎర్రనిలావాను పైకి ఎగజిమ్ముతుంది...
అడవిలో ఆకలితో వున్న
ఆడసింహం ఏం చేస్తుంది ?
అమాయకపు జింకపిల్లలే
ఆహారంగా ఆశతో వెదుకుతుంది
కారుచీకట్లో చిక్కుకున్న
ఏ మనిషైనా ఏం చేస్తాడు ?
చిరుదీపం వెలిగిస్తాడు చీకటి
చీల్చి చిరునవ్వులు చిందిస్తాడు
కష్టాలు కలవర పెట్టే వేళ
ఏ మనిషైనా ఏం చేస్తాడు ?
జీవితంలో తగిలిన
ఎదురు దెబ్బలు
గుండెల్లో గుచ్చుకున్న
గునపాలు గుర్తుచేసుకుంటాడు
గుణపాఠాలను నేర్చుకుంటాడు
గతం గతః అనుకొని
కృంగిపోక కుమిలిపోక...
మృత్యువుకు భయపడక
సాహసమే నా ఊపిరంటాడు రామబాణంలా
రయ్ మంటూముందుకు దూసుకుపోతాడు...



