కారుమేఘాలు
కరిగి చిమ్మచికట్లు తొలిగి
తూర్పున సూర్యుడు
తప్పక ఉదయిస్తాడు
నారుపోసినవాడు
తప్పక నీరు పోస్తాడు
నీకు జన్మనిచ్చిన దేవుడు నిన్నాదుకుంటాడు
ఎన్ని ఎదురు
దెబ్బలు తగిలినా సరే
నీ విశ్వాసమే
నీ ఊపిరిగా నీవు జీవిస్తే
అనునిత్యం భక్తితో
ఆ భగవంతుని ధ్యానిస్తే
ప్రతిదినం ప్రతిక్షణం
ఆ పరమాత్మనే స్మరిస్తే
రాళ్ళు రత్నాలైనట్లు
శిలలు శిల్పాలైనట్లు
నీ కష్టాలు కన్నీళ్లు రేపు
చెరగని చిరునవ్వులౌతాయి
నీ ఇంట సుఖం సంతోషాలు వెల్లివిరుస్తాయి
నీ పై కృపావరములు కుమ్మరించబడతాయి
భయపడకు బాధపడకు
భగవంతున్ని నిందించకు
రాని...లేని...అతి చిన్న
సమస్యలకే అతిగా స్పందించకు
తెలంగాణ తెలుగుబిడ్డకు..!
భారతరత్న పురస్కారం....!
నిషేధించిన "వందేమాతరం"
గీతాన్ని ఆలపించి ఆంగ్లేయుల
ఆగ్రహానికి గురైన ఉస్మానియా
విశ్వవిద్యాలయం ముద్దుబిడ్డ...పీవీ
నిజాం నిరంకుశ పాలనకు...
రజాకార్ల రాక్షస కృత్యాలకు...
వ్యతిరేకంగా పోరాడిన స్వామీ
రామానంద తీర్థ ప్రియశిష్యుడు...పీవీ
ప్రతిష్టాత్మకమైన
ప్రధానమంత్రి పీఠాన్ని
అధిరోహించిన
"ఏకైక తెలంగాణ తెలుగు బిడ్డ"
16 భాషలు నేర్చిన బహుభాషా కోవిదుడు
రవీంద్ర భారతిలో మాడుగుల
నాగఫణి శర్మ సహస్రావధానంలో
పృచ్చకుడైన సాహితీవేత్త... పీవీ
అత్యున్నత పదవిలో ఉన్నా
కంప్యూటర్లో ఇంగ్లీష్ తెలుగు
టైపింగ్ నేర్చుకున్న...నిత్య విద్యార్థి...
తన ఆత్మకథను "ది ఇన్సైడర్" గా
ఆంగ్లంలో వ్రాసుకొని తెలుగులోకి
అనువదించబడిన "లోపలిమనిషి"...పీవీ
విద్యాశాఖమంత్రిగా
తెలుగు అకాడమీని
స్థాపించిన....తెలుగు భాషాభిమాని...
విదేశీ వ్యవహారాల మంత్రిగా
తన సొంత ఖర్చులతో కారును కొన్న
నిస్వార్థ ప్రజానాయకుడు...నీతికి
నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం.....పీవీ
అట్టి అపర చాణక్యుడికి
బహుభాషా కోవిదుడికి...
బహుముఖ ప్రజ్ఞాశాలికి...
నిస్వార్థ ప్రజానాయకుడికి...
భారతరత్న పురస్కారం దక్కడంతో...
మాజీ ప్రధాని పాములపర్తి...
వెంకట నరసింహారావు కీర్తి...
మన తెలుగు జాతి ఖ్యాతి...
నింగిలో తారలుగా నిలిచిపోవునుగాక..!
ఆనాడు అధికారుల నిర్లక్ష్యంతో
జరిగిన అంతిమ సంస్కారంతో...
అవమాన భారంతో...
ఆత్మ క్షోభతో అసంతృప్తితో ...
దివికేగిన ఆ లోపలి మనిషి...
నేటి నవయువతరానికి స్పూర్తిప్రధాత
మన ప్రియతమ మాజీ తెలుగుప్రధాని
శ్రీ పీవీ నరసింహారావు గారి ఆత్మ
ప్రతిష్టాత్మకమైన ఈ "భారతరత్న"
పౌర పురస్కారంతో...శాంతించును గాక..!



