Facebook Twitter
చెవులు గలవాడు వినునట

కష్టాల కడలికి
ఎదురీదలేనప్పుడు...
సమస్యల సర్పాలను సంహరించలేనప్పుడు...
సకాలంలో పరిష్కారాలను
కనుగొనలేనప్పుడు...
నిరాశ నిప్పుల్లో పడి
మాడి మసైపోతున్నప్పుడు...
అందరూ వల్లించే మెట్టవేదాంతం
ఒక్కటే..."అంతా నా తల రాతని"...

అందుకే కష్టేఫలి అనుకుంటే...ఆ
శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని...
పామైనా కరవదని ఆకైనా కదలదని...
బాధ్యతలను విస్మరించడం...
మనిషి సోమరితనానికి...
బలహీనతలను సమర్థించుకోవడం...
మనిషి పిరికితనానికి...
నిలువెత్తు నిదర్శనమని తెలుసుకోవాలి...

ప్రతిమనిషి...
తన వైఫల్యాలకు కారణం
చుట్టూ ఉన్న మనుషులేనని...
తట్టుకోలేని పరిస్థితులేనని...
చిట్టచివరకు ఆ పరమాత్మడని
నిందలు వేస్తాడు నిప్పులు చెరుగుతాడు

ఔను కష్టాలను
భూతద్దంలో చూసి
భయపడకూడదు 
అవే మనకు గుణపాఠం
నేర్పే గురువులని గుర్తించాలి
మన తలరాతలను
మనమే తిరగరాసుకోవాలి

నిరాశకు గురి కారాదు
మానసికంగా కృంగిపోరాదు
దృఢంగా ధైర్యంగా ఉండాలి 
మనసు నిండా
ప్రశాంతతను నింపుకోవాలి

ముందే సుఖజీవనముందని
ఊహించుకోవాలి
మానసిక బలాన్ని పెంచుకోవాలి
బాధలో ఉన్ననాడు
భగవంతుని సహకారం పుచ్చుకోవాలి

మన క్లిష్ట పరిస్థితులకు
కారణం మనలోని దుష్టతలంపులేనన్న
మన కష్టనష్టాలకు కారకులం మనమేనన్న
నగ్నసత్యాన్ని ఎరిగి జీవితాన్ని సాగించాలి