కోతులే పులులై పులిని వేటాడిన వేళ...
మూకుమ్మడిగా పులిపై దాడిచేసిన వేళ...
అడవికి రాజైన పులి జింకలా మారిన వేళ...
ప్రాణభయంతో పులి పరుగులు పెట్టిన వేళ!
"ఐక్యతే"... అణ్వాయుధమని...
సమిష్టి కృషితో...సర్వం సాధ్యమని...
వానర సైన్యం నరజాతికిచ్చె...శుభసందేశం!
ఔరా ! అడవిలోని జంతువుల్లో
ఎంతటి అబ్బుర పరిచే ఐక్యత..!
మానవుల్లో ఆ ఐక్యత ఆ సఖ్యత
కంటికి కనిపించకున్నది లేశమైనా...
వేయి దివిటీలతో వెతికినా విశ్వమంతా...
దండుగా కదిలిన చలిచీమల సైన్యం
కోరలు చాచే కోడెనాగులను సైతం సంహరించి "సమాధి" చేసినట్లు...
ఆకస్మికంగా అహంకారంతో తమపైకి
దాడికి దిగిన చిరుతను మూకుమ్మడిగా ఎదురించి చీల్చిచండాడింది వానరసైన్యం
ఉక్కిరిబిక్కిరి చేసి పళ్ళతో...
రక్కిరక్కి పులికి చుక్కల్ చూపించి...
జింకలా ప్రాణభయంతో పారిపోయేలా..
చేసిన ఆ కోతుల ఐక్యత...ఆ సఖ్యత...
అసూయా...ద్వేషాలతో...
కుట్రలతో.....కుతంత్రాలతో...
పగలతో......ప్రతీకారాలతో....
రగిలే...ఈ మనుష్యులకు...
కరుణ...జాలి...దయాదాక్షిణ్యాలు...
ప్రేమాభిమానాలు...గౌరవ మర్యాదలు...
మరచిన మనుష్యులకు నేర్పింది గుణపాఠం



