ఓ నా ప్రియ నేస్తమా !
నీ పరుగు ఆపకు...
నీ గమ్యం చేరేవరకు...
నీ లక్ష్యం నెరవేరేవరకు...
నీ ప్రతి మాటలో బాటలో
భారతీయతనే "జపించు"
నిత్యం విశ్వశాంతికై "తపించు"
విశ్వగురువు - స్వామి వివేకానందలా...
ఓ నా ప్రియ నేస్తమా !
నీలోని పగను...
ప్రతీకారాన్ని...ద్వేషాన్ని
కోపాన్ని తక్షణమే "త్యజించు"
శాంతమూర్తి - గౌతమ బుధ్ధునిలా...
ఓ నా ప్రియ నేస్తమా !
నీ శత్రువులను సైతం "ప్రేమించు"
నిన్ను హింసించిన వారిని "క్షమించు"
మంచిని మానవత్వాన్ని "ప్రబోధించు"
కరుణామయుడు-ప్రభువైన యేసుక్రీస్తులా
ఓ నా ప్రియ నేస్తమా !
అట్టడుగు వర్గాల హక్కులకై
నీ రక్తాన్ని స్వేదంలా "చిందించు"...
నిప్పులా "జ్వలించు"
నిరంతరం "పోరాడు"
రాజ్యాంగ శిల్పి- డా.బి.ఆర్ అంబేద్కర్ లా
ఓ నా ప్రియ నేస్తమా !
అహింసే ఆయుధంగా...
రక్తపాత రహితంగా
నీ బొందిలో ఊపిరి ఓపిక
ఉన్నంతవరకూ..."ఉద్యమించు"
సింహాలనైనా "ఎదురించు"
నీ హక్కులు "సాధించు"
అహింసావాది - మహాత్మా గాంధీలా...
ఓ నా ప్రియ నేస్తమా !
అమాయకుల అజ్ఞానుల
శక్తిహీనుల నేత్రాలు"తెరిపించు"
సుఖ జీవన సూత్రాలను"బోధించు"
ఆరోగ్యంగా ఆనందంగా అందరికీ
ఆదర్శంగా ప్రశాంతంగా "జీవించు"
సమతామూర్తి -
శ్రీ రామకృష్ణ పరమ"హంస"లా...



