Facebook Twitter
ఈ ధర్మ సందేహాలు...తీర్చేదెవరు?

అకాల మృత్యువు
ఎక్కడుందో ఎవరికెరుక.కాని
క్షణంలో ముందర ప్రత్యక్ష మౌతుంది
బ్యాంకులో గ్లాస్ డోర్ గుద్దుకొని
గాజుముక్క కడుపులో గుచ్చుకొని
ఒక మహిళ చనిపోయింది,
ఎక్కడుంది మృత్యువు?
ఆ గాజుముక్కలో దాగివుందా ,?
కనుక్కోవడమెలా?
తప్పించుకోవడమెలా?
ఆ ప్రమాదాన్ని ముందే పసికట్టేదెలా ?
ఆ మృత్యువును అడ్డుకునే దెవరు?
దాన్ని ఎదుర్కొనే మార్గాలే లేవా?
దానితో పోరాడి గెలవలేమా?
దాన్ని మట్టుపెట్టే ఆయుధాలే లేవా?
చావు ఏవైపు నుండి వస్తుంది?
మనిషి శవాన్ని కదలని కట్టెగా మార్చి
మనిషిలోనున్న ఆత్మను దొంగిలించే
ఆ మృత్యువు ఎలా ఆత్మను ఎత్తుకెళ్తుంది?
మృత్యువు రూపమేమిటి?
ఆత్మ ఆకారమేమిటి?
మృత్యువు దగ్గరికి ఆత్మ వచ్చిందా?
ఆత్మ దగ్గరకు మృత్యువే వెళ్ళిందా?
ఆత్మ స్థానం మనిషి శరీరమైతే
మరి మృత్యువు నివాసమెక్కడ?
జననం మరణం రెండు మనచేతుల్లో లేవా ?
మరెవరి చేతుల్లో వున్నాయి?
ఈ జననమరణాలు ఆగేదెన్నడు?
మనిషికి తెలిసేదెప్పుడు?అసలు
వీటి రహస్యం బట్టబయలయ్యేదెప్పుడు?
కొందరు పుట్టకముందే
కొందరు పుడుతూనే
కొందరు పుట్టిన తక్షణమే
కొందరు పుట్టిన చాలా
ఏళ్ళ తరువాత కన్నుమూస్తారు
మరి ఈ వ్యత్యాసమేమిటిది?
మనిషి జీవితకాలాన్ని నిర్ణయించేదెవరు?
చనిపోయిన మనిషి ఎక్కడికి వెళ్తాడు?
ఎప్పుడు తిరిగి వస్తాడు?
మనిషికి పునర్జన్మ వున్నదా?
ఆత్మ, జీవాత్మ అంతరాత్మ దివ్యాత్మ
ప్రేతాత్మ పరమాత్మ పరిశుద్ధాత్మ
ఇన్ని ఆత్మలున్నాయా? అవెక్కడున్నాయి?
ఇవి చిక్కు ప్రశ్నలేమో
కాని పిచ్చి ప్రశ్నలు మాత్రం కావు
ఈ ధర్మ సందేహాలు తీర్చేదెవరు?