నిన్న నీ నీడ
నీకు తోడు నీడని
భ్రమపడి, నేడు
నిండునిజాలు తెలిసి
నివ్వెరపడిపోతున్నావు
నిజమే నీనీడ
ఒక నిప్పులకుంపటి
నీ నీడ నిన్ను
చాటుమాటుగా
నిన్నుకాటు వేస్తే
కాలనాగు
నీనీడే నీ మెడ మీద
వ్రేలాడే వేటువేసే
పదునైన గండ్రగొడ్డలి
నిన్ను వెన్నుపోటు
పొడిచే నీబాడీగార్డు
నీ నీడే గోడమీది పిల్లి
మేడమీద ప్రాకే బల్లి
రంగులు మార్చేఊసరవెల్లి
అది ఎటు దూకినా
నీ ఊపిరి ఊబిలోకే
అది కేకలేస్తే మృత్యువు
నీ ముందుకు రావొచ్చు
తన ఆకలిని తీర్చమని
అడగవచ్చు
నీ నీడకు ఆకలేస్తే
నీ ఆత్మే దానికి ఆహారం
ఔను నీ నీడే మృత్యువు
పంపిన ఒక గూఢాచారి
నీ గుట్టును కనిపెట్టవచ్చు
నిన్ను మట్టు పెట్టవచ్చు
నీ నేడే ముంచుకొచ్చే
ముప్పు కావచ్చు
అది నిన్ను దహించే
నివురుగప్పిన నిప్పుకావచ్చు
నీ నీడే నీకు సమాధిని త్రవ్వవచ్చు
మృత్యుసంగీతాన్ని వినిపించవచ్చు
నీనీడే నీ ఆయుషును
దానం చేయమని ఆశించవచ్చు
నిన్ను దహనం చేయవచ్చు
కాలం కనన్నెర్ర చేస్తే
నీ నీడే నిన్ను మింగి వేయవచ్చు
నిశ్శబ్దంగా అదినింగిని చేరవచ్చు



