Facebook Twitter
అలుపెరుగక పోరాడితే గెలుపు తథ్యం…

ఏ టైలరైనా
ఎంత ఖరీదైన కొత్తబట్టనైనా కత్తెరతో
ముందు ముక్కలు ముక్కలుగా కట్ చేసి
తిరిగి అన్నింటిని ఒక్కటి చేసి కుట్టినప్పుడే
చక్కని చొక్కా ఒకటి తయారౌతుంది
తొడుక్కోవడానికి వీలౌతుంది

ఏ కార్పెంటరైనా
కొన్న వుడ్ ను రంపముతో రంద్రాలు వేస్తేనే
ఎన్నో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి
తిరిగి అన్నింటిని ఒక్కటి చేస్తేనే చివరికి
ఒక చక్కని టేబుల్ కాని కాట్ కాని తయారవ్వదు
ఇంటికి అందాన్ని కంటికి ఆనందాన్ని ఇవ్వదు

ఏ విద్యార్థి ఐనా
ఒక్కొక్క పరీక్ష వ్రాసి పాసైతేనే, ఇంటర్యూలంటూ
ఆశతో ఎన్నో ఆఫీసుల మెట్లు ఎక్కిదిగితేనే
విక్రమార్కుడిలా తిరిగితేనే విజయం దక్కదు
కోరుకున్న ఒక చక్కని ఉద్యోగం చిక్కదు

ఏ శిల్పి ఐనా
శిధిలమైన శిలను ఉలితో లెక్కలేనన్ని సార్లు
చెక్కితేనే సుత్తితో దెబ్బమీద దెబ్బ కొడితేనే
చివరికి ఒక చక్కని సుందరశిల్పం తయారవ్వదు
గుడిలో దైవమై వచ్చిన భక్తులకు వరాలనివ్వదు

ఏ మనిషైనా
తన జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా
ఎన్ని ఆటంకాలు అవాంతరాలు వచ్చినా
ఎన్ని శిక్షలు అనుభవించినా లక్ష్య సాధనలో
అలుపెరుగక పోరాడితే గెలుపు తథ్యం
ఇది ఎవరూ కాదనలేని ఒక నగ్నసత్యం