ఆ పువ్వెందుకు పుట్టిందో ?
పువ్వు ఎందుకు పుట్టిందో
పుట్టిన పువ్వుకు తెలియదు
పూచిన చెట్టుకు తెలియదు
పెంచిన తోటమాలికి తెలియదు
తెంచిన గుడిలో దేవుడు మెడలో
ఉంచిన పూజారికి తెలియదు
చెట్టు నుంచి తెంచినప్పుడు
ఆ పువ్వు నవ్వుతూనే ఉంది
తన గుండెలో సూదితో గుచ్చి
దారానికి ఎక్కిస్తున్నప్పుడు
ఆ పువ్వు నవ్వుతూనే ఉంది
కన్నీటిచుక్క రాల్చలేదు కారణం
ఆతోటలో పూలెన్ని పూచినా
పూలహారంలో భాగమయ్యే
భాగ్యం తనకే చిక్కినందుకు
తానా పరమేశ్వరుని చేరినందుకు
మెడలోహారంగా మారినందుకు
పువ్వుగా పుట్టినందుకు
పుణ్యం దక్కినందుకు తన
జన్మధన్యమై పోయినందుకు
ఔను మనిషి ముక్తిని పొందాలంటే
భక్తితో నిత్యం భగవంతున్ని సేవించాలి
జీవితంలో అనేక కన్నీళ్లను...కష్టాలను
బాధలను...వేదనలను...వ్యాధులను
భరించినవారే....భగవంతుని "సన్నిధి" చేరేది
ఓర్పుతో నిరీక్షించే వారికే"బంగారునిధి" దొరికేది



