ఓ మనిషీ !
నీవు అంధకారంలో
అయోమయంలో అమాయకత్వంలో
అవివేకంతో అజ్ఞానంతో అహంకారంతో
అటూ ఇటూ కాని సిగ్గూ లజ్జాలేని
రోషం పౌరుషం లేని జీవితం జీవించకు
ఓ మనిషీ !
నీలో అనంతమైన శక్తివుందని
అదే నిన్ను నడిపిస్తుందని,నమ్ము
క్రిందపడిన ప్రతిసారి పైకిలేచి నిలబడు
ముందుకే చూడు ముందుకే అడుగెయ్
పరాజయం నుండి కూడా పాఠాలు నేర్చుకో
గెలుపు నీకే సిద్ధిస్తుంది విజయలక్ష్మి నిన్నే వరిస్తుంది
ఓ మనిషీ !
నీవు ఉన్నదాంతో తృప్తిచెందక
గాడిదలా గడ్డి తినీ తినీ
జలగలా జనాన్ని పీడించి పీడించి
అడ్డదారిలో కోట్లు కోట్లు ఆర్జించి ఆర్జించి
కుబేరుడనైపోయానని కులకకు,కునుకుతియ్యకు
ఓ మనిషీ !
రేపుదయం నీకనురెప్పలు నీవు తెరవ లేకపోతే
సూర్యోదయాన్ని చూసే భాగ్యమే నీకు లేకపోతే
కన్నులు మూసి నీవు కదలలేని కట్టెగా మారిపోతే
నీవు మళ్ళీమట్టిలోకెళ్ళి నీ ఆత్మ పరమాత్మను చేరితే
నీ ఆస్తులన్నీ పరులకే చెందునన్న ఓ పచ్చినిజం తెలుసుకో



