నిద్రరాక సముద్రం
నిరంతరం ఘోషిస్తుంది
నిద్రరాకున్నా అందమైన అలలతో
కమ్మనైన కలలుకంటుంది అది
ఘోష కాదు దాని భాష అంతర్వాణి
అన్వేషిస్తే అర్థం చేసుకోగలిగితే
లోతుగా అధ్యయనం చేస్తే సముద్రం
మనిషికి ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తుంది
అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే
శోఖాల మరుగున దాగి సుఖమున్నదిలే
ఏదీ తనంతట తానై నీదరికిరాదు శోధించిసాధించాలి అదియే ధీరగుణమన్న గొప్ప జీవిత సందేశాన్ని
అందించేది అంతులేని ఆ అనంత సాగరమే
ఎగిసిపడే అలలు చెబుతాయి
చెడిపోయినా బాగుపడాలని,
విడిపోయినా కలవాలని, పడిపోయిన లేవాలని
కమ్మనికలలు కనమని అవి తీరం చేరేవరకు
కంటిలో కునుకు రాకూడదని
అల్లకల్లోలిత సంద్రంలో
ఆకస్మికంగా వచ్చే పెనుతుఫాన్లు
మెరుపు దాడిచేసి భీభత్సం సృష్టించే సునామీలు
మనిషి జీవితంలోని ఆటుపోట్లకు సజీవసంకేతాలు
నీ మనసు ఆకాశమంత విశాలంగా ఉన్నా
నీ హృదయం సముద్రమంత లోతుగా ఉన్నా
నీకు భూదేవి అంత ఓర్పు సహనం ఉన్నచాలు
నీ జన్మ ధన్యమని ప్రబోధిస్తుంది మన భగవద్గీత
లేకున్న తారుమారే నీనుదిటివ్రాత వికటిస్తే ఆవిధివ్రాత
ఔను ఎంతో నిర్మలమైన ఎంతో నిశ్చలమైన
ప్రశాంతమైన జీవితానికి తానే సజీవ సాక్ష్యమని
ప్రతిమనిషికి ఒక "అదృశ్య సందేశాన్ని" అందించేది
ఉషోదయవేళ కనువిందుచేసేది ఆఅలలకలల కడలియేకదా



