Facebook Twitter
ఖచ్చితంగా చెప్పలేము...

ఏ చెట్టు...ఖచ్చితంగా చెప్పలేదు
తనకెన్ని కొమ్మలు రెమ్మలు
వేర్లు ఆకులు ఉన్నాయోనని
ఎన్నికాయలు కాశాయోనని
ఏ పూలమొక్క...ఖచ్చితంగా చెప్పలేదు  
తనకెన్ని పూలు పూశాయోనని ఆ రెండు
ప్రకృతి ధర్మాన్ని పాటించడం తప్ప...

ఏ మనిషి...ఖచ్చితంగా చెప్పలేడు
తన తలపై ఎన్ని వెంట్రుకలున్నాయోనని
అర్థంకాని కాకిలేక్కలు వేయడం తప్ప...

ఏ తల్లి...ఖచ్చితంగా చెప్పలేదు
తన కడుపెప్పుడు పండుతుందోనని
తనకెంతమంది పిల్లలు పుడతారోనని
ముక్కోటి దేవుళ్ళకు మొక్కడం తప్ప...

ఏ ఆటగాడు...ఖచ్చితంగా చెప్పలేడు
హోరాహోరీగా సాగే ఆట ముగిసేవరకు
తనదే గెలుపని తనకే కప్పని మదిలో
ఆ పరమాత్మను ప్రార్థించడం తప్ప... 

ఏ విద్యార్ది...ఖచ్చితంగా చెప్పలేడు
అధికారికంగా రిజల్ట్స్అనౌన్స్ చేసేంతవరకు
తనకు ఏ ర్యాంకు వస్తుందోనని
గాలిలో మేడలు కట్టడం తప్ప...

ఏ నాయకుడు...ఖచ్చితంగా చెప్పలేడు 
ఓట్లలెక్కింపు పూర్తి అయ్యేంతవరకు
తనకెన్ని ఓట్లు..."పోలయ్యా"యోనని
ఊరించే ఊహల్లో ఊరేగడం తప్ప...

ఏ మనిషి...ఖచ్చితంగా చెప్పలేడు ఎప్పుడు
ఆ పరమాత్మ నుండి పిలుపు వస్తుందోనని
తియ్యని ఆ పిలుపుకోసం తపించడం తప్ప
నిద్రాహారాలుమాని ఆ దైవాన్ని జపించడం తప్ప...