Facebook Twitter
నీవు రాయివా ? రత్నానివా ?

నేను, నాది అనే భావన నశిస్తేనే
మనిషి జీవితానికి ఒక పరిపూర్ణత

వాసన చూసి పువ్వును
రుచిని చూసి కాయను
ఇంటిని చూసి ఇల్లాలిని గుర్తుపట్టినట్లే
ఉన్నతమైన భావాలున్న
ఉదాత్తమైన లక్షణాలున్న
ప్రతిమనిషిని గుర్తించాలి గౌరవించాలి

మనసును అదుపాజ్ఞల్లో పెట్టుకున్నవాడే
సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండగలడు
నీతిగా నిజాయితీగా ధైర్యంగా
ధర్మబద్ధంగా జీవించగలడు
కట్టెగా మారేంతవరకు తీసుకున్న
నిర్ణయాలకు కట్టుబడి ఉండగలడు

పురాణాలను పుక్కిట పట్టాలి
వాటిని ధాటిగా ఉదాహరించాలి
మేధస్సును జ్ఞానంతో విజ్ఞానంతో
మేలిమిరత్నాలతో అలంకరించుకోవాలి
అప్పుడే మనిషిమారి...రత్నంలా
కడిగిన ఆణిముత్యంలా మెరిసిపోయేది

నది,నదిలా ప్రవహించినంత కాలం గొప్పే
సముద్రంలో కలిశాక దాని అస్తిత్వమే ఒక‌ ప్రశ్నార్థకం?
మనసు తన అదుపులో ఉన్నంత కాలం
ప్రతి మనిషి మహాత్ముడే, కోరికల సంద్రంలో
కొట్టుకుపోతే అప్పుడు మనిషి ఉనికికే పెనుప్రమాదం?