"కులాభిమానం" మెండుగా
ఉండొచ్చు తప్పులేదు,కాని
"కులపిచ్చి" ఉండరాదు
అది "ఉన్మాదుల" లక్షణం
మన "మతమంటే మమకారం"
ఉండొచ్చు తప్పులేదు, కాని
"పరమతద్వేషం" ఉండరాదు
అది "ఉగ్రవాదుల" లక్షణం
"భాషాభిమానం" మెండుగా
ఉండొచ్చు తప్పులేదు, కాని
పరభాషలపై అసహనం పనికిరాదు
పరభాషలకు దూరంగా ఉండరాదు
ద్వేషం పెచుకోరాదు ధ్వజమెత్తరాదు
అది "అజ్ఞానుల" అవలక్షణం
ఇష్టమైన అమ్మాయిలను
ప్రేమించవచ్చు తప్పులేదు,కాని
కాదంటే ప్రాణాలను తీసేంతటి
"పిచ్చిప్రేమ" ఉండరాదు
అది "రాక్షసజాతి" లక్షణం
మన జాతిపై మన వర్గంపై
వల్లమాలిన అభిమానం ప్రేమ
ఉండొచ్చు తప్పులేదు,కాని
ఇతర జాతినికాని వర్గాన్నికాని
అథఃపాతాళానికి అణగద్రొక్కాలని
అంతంచేయాలనే ఆవేశం
"అహంకారం" ఉండరాదు
అది "మూఢుల మూర్ఖుల"
"ముష్కరుల" ముఖ్యలక్షణం
నీ వారు నీకిష్టమైన వారు
ఎవరెస్టు శిఖరమంత ఎత్తు
ఎదగాలని ఆశించవచ్చు, తప్పులేదు
కాని ఇతర ప్రతిభావంతులు
ఎదుగుతుంటే ఈర్ష్య పడరాదు
కుట్రలు కుతంత్రాలు పన్నరాదు
వారిని ఎదగకుండా అడ్డుపడరాదు
వారిని ఏదైనాఊబిలోకో
లోతైనలోయలోకో నెట్టివేయరాదు
అది "చీడపురుగుల" లక్షణం



